- 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు పదవిలో అసిస్టెంట్ కోచ్‌గా అభిషేక్ నాయర్
- ఫీల్డింగ్ బాధ్యతలు టెన్ డస్కెట్‌కు
న్యూఢిల్లీ: టీమిండియా సహాయక సిబ్బంది విషయంలో చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన పంతం నెగ్గించుకున్నాడు. తాను అనుకున్నట్లుగానే సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్‌ను బౌలింగ్ కోచ్‌గా తీసుకున్నారు. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా బుధవారం వెల్లడించారు. సెప్టెంబర్ 19న చెన్నైలో బంగ్లాదేశ్‌తో మొదలయ్యే తొలి టెస్ట్‌తో మోర్నీ బాధ్యతలు చేపట్టనున్నాడు. 2027 సౌతాఫ్రికాలో వన్డే వరల్డ్ కప్ ముగిసే వరకు అతను ఈ పదవిలో కొనసాగుతాడు.
ఇక అసిస్టెంట్ కోచ్‌గా అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్‌గా రైన్ టెన్ డస్కెట్‌ను కంటిన్యూ చేయనున్నారు. చీఫ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే గౌతీ.. బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్‌ను తీసుకోవాలని గతంలోనే సూచించాడు. కానీ కొన్ని కారణాలతో ఇది ఆలస్యమవుతూ వచ్చింది. లక్ష్మీపతి బాలాజీ, ఆర్. వినయ్ కుమార్ కూడా చివరి వరకు పోటీలో ఉన్నా గంభీర్ నేరుగా రికమండ్ చేయడంతో బీసీసీఐ మోర్కెల్ వైపు మొగ్గింది. ‘కోచ్‌గా గంభీర్‌ను ఇంటర్వ్యూ చేసినప్పుడే సపోర్ట్ స్టాఫ్ గురించి క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఆరా తీసింది. ఆ టైమ్‌లో బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్ వస్తే బాగుంటుందని చెప్పాడు.
అతనితో కలిసి పని చేసిన ఎక్స్‌పీరియెన్స్‌ను కూడా చెప్పడంతో బీసీసీఐ పెద్దలు దానినే పరిగణనలోకి తీసుకున్నారు. నవంబర్ ఆఖరి వారంలో ఆస్ట్రేలియాతో సిరీస్ ఉంటుంది. వాళ్లపై మోర్కెల్‌కు మంచి రికార్డు ఉంది. కాబట్టి అతన్ని తీసుకోవడం వల్ల ఈ సిరీస్‌లో చాలా లాభాలు ఉంటాయి.వచ్చే ఏడాది ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కూడా ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్తే ఆరో మ్యాచ్ కూడా ఉంటుంది.
వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని మోర్కెల్‌కు బాధ్యతలు అప్పగించారు’ అని బోర్డు వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్‌లో ఎన్‌సీఏలో వీవీఎస్ లక్ష్మణ్‌కు రిపోర్ట్ చేయనున్న మోర్కెల్.. దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లను చూసే అవకాశం ఉంది. అలాగే ఎన్‌సీఏ బౌలింగ్ కోచ్ ట్రాయ్ కూలీతో కూడా కొన్ని రోజులు కలిసి పనిచేయనున్నాడు.
కుర్రాళ్లపై గురి..
ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్‌జెయింట్స్‌కు మెంటార్ హోదాలో గౌతీ, బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్ రెండేళ్ల పాటు కలిసి పనిచేశారు. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యంతో పాటు యంగ్ బౌలర్ల పని తీరుపై కూడా అవగాహన ఉంది. ఇక 2014లో ఇద్దరు కలిసి కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఏకంగా ఐపీఎల్ టైటిల్ అందించారు. ఒకప్పుడు డేల్ స్టెయిన్‌తో కలిసి సౌతాఫ్రికా పేస్ బలగాన్ని నడిపించిన మోర్కెల్‌కు ఇండియా పిచ్‌ల గురించి కూడా బాగా తెలుసు. దీంతో యంగ్‌స్టర్స్ మయాంక్ యాదవ్, అవేశ్ ఖాన్, యష్ ఠాకూర్ లాంటి కుర్ర బౌలర్లను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తనపై ఉంది.
రెడ్ బాల్ క్రికెట్‌లో స్టార్ పేసర్ మహ్మద్ షమీపై వర్క్ లోడ్‌ను తగ్గించి జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా మహ్మద్ సిరాజ్‌తో పాటు మరికొంత మంది నాణ్యమైన బౌలర్లను తయారు చేయాలి. ప్రస్తుతం మోర్కెల్ ముందున్న అతి పెద్ద సవాలు ఇదే. తన కెరీర్‌లో 86 టెస్ట్‌లు 117 వన్డేలు, 44 టీ20 ఆడిన మోర్కెల్ 544 వికెట్లు తీశాడు. కాబట్టి ఆ అనుభవంతో ఇండియాకు బౌలింగ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తాడని అందరూ ఆశిస్తున్నారు.