దైవదర్శనానికి వెళ్తూ వ్యాన్ బోల్తా.. ఇద్దరి మృతి

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం గోదరిగూడ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. మరో పదిమందికి గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని కిన్వట్ నుండి దండేపల్లి మండలం ఓడరేవు వద్ద ఉన్న కాకో దేవుని దర్శనానికి కొంతమంది భక్తులు మాక్సి వాహనంలో వచ్చారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం.. గురువారం ఉదయం 5.30 గంటల సమయంలో అదుపుతప్పి మార్నింగ్ వాకర్స్ మీదకు దూసుకెళ్లింది. అప్రమత్తమైన డ్రైవర్.. తప్పించబోవడంతో వాహనం బోల్తా పడింది. వ్యాన్‎లో ఉన్న కనక జంగు (75) అనే వ్యక్తి వ్యాన్‎లో ఇరుక్కొని మృతి చెందగా.. రోడ్డుపై వాకింగ్ చేస్తున్న మేఘరాజ్ అనే వ్యక్తి కూడా తీవ్ర గాయాలతో మృతి చెందాడు. కాగా.. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్‎కి తరలించి చికిత్స అందిస్తున్నారు.