Health alert: పొద్దున్నే మెలకువ వచ్చినా బెడ్​ దిగడం లేదా.. అది బద్దకం కాదు.. జబ్బే..

Health alert:   పొద్దున్నే మెలకువ వచ్చినా బెడ్​ దిగడం లేదా.. అది బద్దకం కాదు.. జబ్బే..

ఎండలు మండుతున్నాయి... పొద్దున్నే లేవాలంటే బద్దకం.. ఒకవేళ మెలకువ వచ్చినా కానీ.. మంచం దిగాలంటే మనసొప్పదు. పని తొందరగా ముగించాలనుకుంటారు. కానీ పూనుకోరు. ఎప్పుడూ హుషారుగా ఉండే వాళ్లు కూడా .. ఈ సీజన్లో పనులకు బద్దకిస్తుంటారు.ఎండలకు వళ్లంతా ఉడికిపోతోందని ఈ మార్పుపై ఓ తీర్పు ఇస్తారు. ఇది ఎండకు వచ్చిన సమస్యే కానీ పరిష్కారం నీడ పట్టున లేదు. ఈ బద్ధకానికీ మందు అవసరమని నిపుణులు అంటున్నారు. 

వేసవి కాలంలో చాలా మంది ఎక్కువ సేపు నిద్రపోతారు .  నిద్రలేచిన తర్వాత...  గంటల తరబడి  నిద్రమత్తులోనే  ఉంటారు. ఇది మత్తుకాదు. పగలు కూడా  బలహీనంగానే ఉంటారు...  కండరాలు పట్టేసినట్లుంటాయి...  రాత్రి నిద్రలో కాళ్లు గుంజుతుంటాయి. చిన్న పని చేసినా పళ్లు నొప్పులు వేధిస్తుంటాయి. ఈ సమస్యలకు కారణం భగభగమండే ఎండల్లో తిరగడమే కారణం అనుకుంటారు. 

చల్లటి నీళ్లు, జ్యూస్, ఐస్ క్రీములు విరుగుడనుకుంటారు. ఇంకొందరు విశ్రాంతి తీసుకుంటారు. అయినా నీరసం, బద్ధకం, నొప్పులు వదలవు. ఎందుకంటే  ఎండల ప్రభావంతో శరీర జీవన క్రియల్లో మార్పులొస్తాయి. ఆ మార్పుని గుర్తించకపోతే ఈ చిన్న సమస్యలే పెద్దవయ్యే ప్రమాదముంది. 

వేడికి చెమట పడుతుంది. ఆ చెమటతో శరీరం నీటినే కాదు..లవణాలనూ కోల్పోతోంది. శరీరం  లవణాలను కోల్పోతే జీవక్రియలు దారితప్పుతాయి. దానికి సంకేతమే తలతిరగడం.. బద్ధకం కండరాలు పట్టేయడం.. కండరాల నొప్పులు మన శరీర అవసరాలకు కావాల్సిన సోడియం, పొటాషియం, క్లోరైడ్, లోపం వల్ల కూడా వడదెబ్బ లక్షణాలు కనిపిస్తాయి. చెమట పోయడం వల్ల సోడియం... క్లోరైడ్లను శరీరం ఎక్కువగా కోల్పోతుంది. వీటి లోపం వల్ల శరీరంలో జీవద్రవ్యాల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మన మెదడును చురుకుగా ఉంచే న్యూరో కెమికల్స్ ఉత్పత్తి తగ్గుతుంది.

 మనం హుషారుగా ఉండేందుకు దోహదపడే. ఎండాన్స్, సెరటోనిన్స్, ఎంకెఫాలిస్ ఉత్పత్తి తగ్గుతుంది. ఈ ఎలక్ట్రోలైట్స్ తగ్గడం వల్ల తల తిరుగుతున్నట్లుగా ఉంటుంది. ఎక్కువగా చిరాకు పడతారు. చిన్న విషయాలకు కూడా ఎక్కువగా స్పందిస్తూ ఉంటారు. కండరాల కదలికలకపై కూడా లవణాల లోపం...  ప్రభావం చూపుతుంది. కండరాలకు ఆక్సిజన్​  సరిగా అందదు. అందువల్ల కాళ్లు ఎక్కువగా తిమ్మిరి పడతాయి. కండరాల్లో లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందువల్ల చిన్న పని చేసినా కండరాలు అలసిపోతాయి. ఎక్కువ సమయం శ్రమ చేసేందుకు సహకరించవు. నిద్రపోయేప్పుడు, విశ్రాంతి తీసుకునేప్పుడు కాళ్లు గుంజుతాయి. అసిడిటీ పెరుగుతుంది. దానివల్ల అల్సర్​ కు  దారి తీస్తుంది. 

హైపోనట్రేమియా

చెమట ఉప్పగా ఉండటానికి కారణం సోడియం మన శరీరానికి కావాల్సిన మోతాదులో లవణం మనం తీసుకునే ఆహారంలో ఉంటుంది. రక్తంలో సోడియం తగ్గితే మెదడు పనితీరు మందగిస్తుంది. వేసవిలో పగలే కాదు, రాత్రి వేళల్లో కూడా చెమట పోస్తుంది, ఈ చెమటతో పాటే సోడియం లవణాలు కూడా బయటకు పోతాయి.  రక్తంలో సోడియం శాతం తగ్గుతుంది. కిడ్నీలు, గుండె సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా రక్తంలో సోడియం శాతం తక్కువగా ఉంటుంది. కొన్ని రకాల మందుల ప్రభావం వల్ల కూడా ఇది జరుగుతుంది. సోడియం లోపాన్ని "హైపో నట్రేమియా' అంటారు. ఈ సమస్యతో ఉన్న వాళ్లు గందరగోళంగా వ్యవహరిస్తూ ఉంటారు. మెదడు చురుగ్గా పనిచేయదు. సోమరితనం పెరుగుతుంది. సోడియం తగ్గుతూ ఉంటే ఈ లక్షణాలు కూడా పెరుగుతూ ఉంటాయి. కాళ్లు .. చేతులు గుంజుతున్నట్లుగా ఉంటుంది. కండరాలు పట్టిస్తాయి. వేగంగా కదలడానికి కండరాలు సహకరించవు. 

హైపోకలేమియా 

సాధారణ వ్యక్తిలో ఉండే లీటరు రక్తంలో 3.6 నుంచి 5.2 మిల్లీ మాల్స్ పరిమాణంలో పొటాషియం ఉంటుంది. సమతులాహారం తీసుకోకపోవడం వల్ల రక్తంలో పొటాసియం పరిమాణం తగ్గుతుంది. మద్యం తాగడం, దీర్ఘకాల కిడ్నీ వ్యాధులు, మధుమేహం, డయేరియా, అధికంగా చెమటలు పట్టడం, ఫోలిక్ యాసిడ్ లోపం, వాంతులు, కొన్ని రోగాలకు వాడే మందుల ప్రభావం వల్ల శరీరంలో పొటాషియం పరిమాణం తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిని. 'హైపోకలేమియా' అంటారు. ఈ సమస్య ఉన్నవాళ్లలో రక్తపోటులో అసాధారణ మార్పులుంటాయి. కండరాల నొప్పులతో బాధపడతారు. కండరాలు బలహీన పడడం వల్ల కాళ్లు, చేతులు అప్పుడప్పుడూ వణుకుతూ ఉంటాయి.

హైపోక్లోరేమియా 

వాంతులు.. విరేచనాలు.. చెమట పట్టడం, జ్వరం వల్ల శరీరం క్లోరెడ్​ ను కోల్పోతుంది. చాలా మందిలో క్లోరైడ్ లోపాన్ని గుర్తించే లక్షణాలు వెంటనే బయటవడవు

కదలికతో ఉపశమనం 

సోడియం, పొటాషియం, క్లోరైడ్ లోపం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఈ సమస్యలు నుంచి ఉపశమనం కోసం యోగా, మెడిటేషన్, స్విమ్మింగ్, వ్యాయామం చేయాలి. వీటివల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. కండరాల్లోకి రక్తప్రసరణ పెంచేందుకు మసాజ్ చేయాలి. కేరళ అభ్యంగన మర్మ తెరపీ వల్ల మంచి ప్రయోజనాలుంటాయి. ఈ సమస్య ఉన్న రోజుల్లో వారానికి ఓసారి 45 నుంచి 60 నిమిషాల పాటు మసాజ్ చేయించుకోవాలి. ప్రాణాయామం కూడా కండరాలకు రక్తప్రసరణ పెంచుతుంది. వ్యాయామం చేయడం వల్ల మెదడులో న్యూరో కెమికల్స్ విడుదలవుతాయి. మనసు ఆహ్లాదంగా ఉంటుంది. కండరాలు పనితీరు కూడా మెరుగవుతుంది.