డిజైన్లలో లోపాల వల్లే ప్రాణాలు పోతున్నా పట్టించుకోని అధికారులు

యాదాద్రి/సూర్యాపేట, వెలుగు:   యాదాద్రి, సూర్యాపేట జిల్లాల మీదుగా వెళ్తున్న హైదరాబాద్‌-–విజయవాడ, హైదరాబాద్-–వరంగల్​నేషనల్ హైవేలపై డిజైనింగ్‌లోపాలు, నిర్వహణ సరిగా లేకపోవడంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.  గ్రామాల్లోకి వెళ్లేచోట, యూ టర్న్స్ ల వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి.  గతేడాది యాదాద్రి జిల్లాలో 591 రోడ్డు ప్రమాదాలు జరగగా, 218 మంది చనిపోయారు. సూర్యాపేట జిల్లాలో 154 యాక్సిడెంట్లు జరగగా 82మంది మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో కూడా ఇద్దరు కూలీలు చనిపోయారు. 

ప్రమాదాల నివారణకు చర్యలేవీ? 

విజయవాడ– హైదరాబాద్, వరంగల్​ జాతీయ రహదారుల డిజైన్‌లో లోపాలు కొట్టొచ్చినట్టు కన్సిస్తున్నా సంబంధిత అధికారులు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అండర్‌ వే, సర్వీస్‌ రోడ్డు సరిగా ఏర్పాటు చేయలేదు. నిర్మించిన క్రాస్‌లోనూ సరైన సిగ్నల్స్, జీబ్రా లైన్స్, లైటింగ్‌ లేవు. తక్కువ దూరంలోనే డివైడర్లు ఏర్పాటు చేయడంతో  ఫలితంగా ప్రమాదాలు అధికమవుతున్నాయి. వాహనదారులు సైతం దూరం తక్కు వ అవుతుందన్న కారణంతో ప్రతి క్రాస్‌  వద్ద రాంగ్‌ రూట్‌ లో ప్రయాణాలు చేస్తుండడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. 

ఏడాదైనా పరిహారం రాలే

రోడ్డు ప్రమాదాల్లో పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడుతున్న కుటుంబాలకు పరిహారం కూడా సరిగా అందడం లేదు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకులపాముల వద్ద శనివారం జరిగిన ప్రమాదం తరహాలోనే యాదాద్రి జిల్లా ఆలేరులో గతేడాది మార్చి 6న జాతీయ రహదారిపై యాక్సిడెంట్ ​జరిగింది. మొక్కలకు నీళ్లు పోస్తున్న కూలీలను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో నలుగురు చనిపో యారు. వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఏడాదైనా వారికి పరిహారం అందలేదు. ఈ విషయాన్ని మరణించిన కూరెళ్ల శ్యామ్​, లావణ్య దంపతుల పిల్లలు రుతిక, గణేశ్​ ఈనెల 13న కలెక్టర్​ పమేలా సత్పతి దృష్టికి తీసుకెళ్లి పరిహారం త్వరగా ఇప్పించాలని కోరారు.