ఖమ్మం అందాలకి కేరాఫ్​

ఖమ్మం అందాలకి కేరాఫ్​

ఎత్తైన కొండలు.. పరవళ్లు తొక్కే జలపాతాలు.. ఉప్పొంగే చెరువులు.. పచ్చదనం అల్లుకున్న పార్కులు..చరిత్రకి అద్దం పట్టే గుడులు, కట్టడాలు. ఇవన్నీ చూడాలంటే ఖమ్మం జిల్లా వెళ్లాల్సిందే. ఖమ్మం ప్రకృతి అందాలకి పెట్టింది పేరు. జిల్లా అంతటా మనసుకి ఆహ్లాదాన్నిచ్చే  ప్రదేశాలెన్నో ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లకారం చెరువు, వైరా, పాలేరు రిజర్వాయర్​ల గురించి.. వీటితో పాటు ఖమ్మం ఖిల్లా, తీర్థాల సంగమేశ్వర స్వామి, నరసింహ స్వామి ఆలయం చూడాల్సిందే. 

లకారం చెరువు ఖమ్మం మినీ ట్యాంక్​బండ్​​గా మారింది. ఈ ట్యాంక్​బండ్​పై  తీగల వంతెన స్పెషల్​ అట్రాక్షన్​. దీనిపై నడుస్తూ చెరువు అందాలని చూడటం మంచి అనుభూతినిస్తుంది. ఈ చెరువుని అనుకొని ఉన్న వాకింగ్​ ట్రాక్​, దాని చుట్టూరా పచ్చని చెట్లు ఉన్నాయి. బోటింగ్​ కూడా చేయొచ్చు ఇక్కడ. అడ్వెంచర్​ని ఇష్టపడే వాళ్లకోసం రోప్​ స్లైకింగ్​ , పిల్లల కోసం ప్లే స్టేషన్​ ఉంది. ​ ఉదయం ఐదింటి నుంచి ఏడింటి వరకు.. మళ్లీ సాయంత్రం ఐదింటి నుంచి ఎనిమిదింటి వరకు మాత్రమే తెరిచి​ ఉంటుంది. ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు.
 
నీటి అందాలు..
 ఖమ్మం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో కూసుమంచి మండలంలో ఉంది పాలేరు రిజర్వాయర్​. దీన్ని ఆనుకొని పాలేరు టూరిజం పార్కు కూడా ఉంటుంది.  పార్కులో నడుస్తూ రిజర్వాయర్​ అందాల్ని ఆస్వాదించొచ్చు. ఈ పార్కులో శివాలయం కూడా ఉంది. రిజర్వాయర్​ని​ దగ్గరగా చూడాలనుకునేవాళ్లు మధ్యలో కట్టిన వంతెన నుంచి పారే నీళ్లని చూడొచ్చు. రిజర్వాయర్​ దగ్గరికి నేరుగా వెళ్లడానికి మెట్లదారి కూడా ఉంది. ఈ రిజర్వాయర్​లో పడవ ప్రయాణం కూడా చేయొచ్చు. ఈ చెరువుకి దగ్గర్లో .. ఖమ్మం పట్టణం నుంచి 20 కి.మీ. దూరంలో ఉన్న కూసుమంచికి వెళ్తే కాకతీయుల కాలం నాటి శివాలయాన్ని చూడొచ్చు. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న ఈ గుడి కాకతీయుల వైభవాన్ని చెప్తుంది. అలాగే ఖమ్మంకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వైరా రిజర్వాయర్​ కూడా కచ్చితంగా చూడాల్సిన ప్లేస్​. దాదాపు 25 వేల ఎకరాలకి సాగునీరు, ఎనిమిది మండలాలకి తాగునీరు  అందించే ఈ చెరువు నీళ్లతో ఎప్పుడూ కళకళలాడుతుంది. వర్షాకాలంలో దీని అందాల్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. దీన్ని ఆనుకొని ఉండే గెస్ట్​హౌజ్​లో స్టే చేయొచ్చు. బోటింగ్​తో పాటు ఎన్నో సరదా ఆటలుంటాయి గెస్ట్​హౌజ్​లో. అలాగే ఖమ్మం నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేలకొండపల్లిలో బౌద్ధస్తూపం ఉంది. దాదాపు పది  ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్తూపం చుట్టూ పచ్చదనం పరుచుకొని ఉంటుంది. 

చరిత్ర చెప్పే ఖిల్లా..
ఇక ఖిల్లా గురించి చెప్పాల్సిందేముంది. దీన్ని కట్టడానికి 56 ఏండ్లు పట్టిందట. ‘స్తంభాద్రి’ అనే పెద్ద రాయి మీద  రాళ్లతో కట్టిన ఈ కోట నాలుగు చదరపు కిలో మీటర్లు ఉంటుంది. ఈ కోట లోపల చిన్న చిన్న గుళ్లు,  మండపాలు, మసీదు ఉంటాయి. ఈ కోట కట్టడంలో హిందూ, ముస్లిం ఆర్కిటెక్చర్​  కనిపిస్తుంది. కోట ప్రధాన ద్వారం 30 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనికి రెండు వైపులా ఫిరంగుల్ని చూడొచ్చు. వర్షం నీళ్లని ఒడిసిపట్టేందుకు ఇటుకలు, సున్నపురాయితో కట్టిన నీటి ట్యాంకులు ఉన్నాయి ఇక్కడ. కోటలో పది గేట్లు ఉన్నాయి. రాళ్లతో తయారుచేసిన నీటి బిందెలు ఉంటాయి. కోట కిటికీలు చూడొచ్చు. మెట్ల మార్గం నుంచి ఈ కోట ఎక్కితే ఖమ్మం సిటీ మొత్తం కనిపిస్తుంది కూడా. అందుకే వీకెండ్స్​లో చుట్టు పక్కల ఊళ్ల వాళ్లు ఈ ప్లేస్​కి వెళ్తుంటారు. ఖమ్మం పట్టణంలో  ఏర్పాటు చేసిన స్టాచ్యూలు, వాటర్​ ఫౌంటెయిన్​లు... వాటి చుట్టూ పచ్చని చెట్లు మనసుకి ఎంతో హాయినిస్తాయి. 

స్తంభాకారంలో ..
ఖమ్మం నడిబొడ్డున ఎత్తైన గుట్టపై ఉంది శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నరసింహ స్వామి గుడి. శ్రీ మహా విష్ణువు  నరసింహ స్వామి అవతారంలో  స్తంభం నుంచి ఉద్భవించి  హిరణ్య కశిపుడిని సంహరించిన విషయం తెలిసిందే. ఆరోజు స్తంభం నుంచి ఉద్భవించిన స్వామియే ఈ గుట్ట కిందనున్న గుహలో వెలిశాడని నమ్ముతారు. ఈ కొండ ఒక స్తంభం ఆకారంలో ఉంటుంది. సాధారణంగా దేవాలయాలు తూర్పు లేదా ఉత్తర దిక్కులో ఉంటాయి. కానీ, ఈ నరసింహ స్వామి మాత్రం దక్షిణ ముఖుడిగా ఉంటాడు.ఈ కొండపైన నీటి కొలనులు కూడా ఉంటాయి. ఈ గుడిలో ఆంజనేయ స్వామి, నల్లరాతితో చేసిన సాయి బాబా విగ్రహాలు ఉన్నాయి. అలాగే ఖమ్మంకి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తీర్ధాల సంగమేశ్వర స్వామి గుడికి చాలా విశిష్ఠత ఉంది. ఈ గుడిలో పక్కపక్కనే మూడు గర్భగుడులు ఉంటాయి. త్రివేణి సంగమాన్ని చూడొచ్చు ఇక్కడ.