సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం తొలి రోజు విజయవంతంగా ముగిసింది. మెగా వేలం ప్రారంభం నుండి చివరి వరకు హోరా హోరీగా సాగింది. తమకు కావాల్సిన ఆటగాళ్లను దక్కించుకోవడం కోసం ఫ్రాంచైజ్‌లు పోటీ పడ్డాయి. దీంతో ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. ముఖ్యంగా ఇండియన్ ప్లేయర్ల కోసం ఫ్రాంచైజ్‌లు పోటీ పడి మరీ కోట్లు కుమ్మరించాయి.
తొలి రోజు వేలంలో భారత యువ వికెట్ కీపర్/ బ్యాటర్ రిషబ్ పంత్ రికార్డ్ సృష్టించాడు. ఢిల్లీ వదిలేయడంతో వేలంలోకి వచ్చిన పంత్‌ను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీల పోటీపడ్డాయి. చివరకు లక్నో సూపర్ జైయింట్స్ పంత్‌ను కనీవినీ ఎరుగని రీతిలో రూ.27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. తద్వారా ఐపీఎల్ హిస్టరిలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ చరిత్ర సృష్టించాడు. పంత్ తర్వాత మరో టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ రికార్డ్ ధర పలికాడు. శ్రేయస్ అయ్యర్‌ను రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.
తొలిరోజు అత్యధిక ధర పలికిన ఐదుగురు
- రిషబ్ పంత్: రూ.27 కోట్లు (LSG)
- శ్రేయస్ అయ్యర్: రూ.26.75 కోట్లు (PBKS)
- వెంకటేశ్ అయ్యర్: రూ.23.75 ట్లు (KKR)
- యుజ్వేంద్ర చాహల్: రూ.18 కోట్లు (PBKS)
- అర్షదీప్ సింగ్: రూ.18 కోట్లు (PBKS)