ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఆల్ రౌండర్ల పంట పడుతుంది. ఇప్పటివరకు ముగిసిన వేలంలో ఆల్ రౌండర్లకు కాసుల వర్షం కురిసింది. వీరిలో ఎక్కువగా బౌలింగ్ ఆల్ రౌండర్లే ఉండడం విశేషం. పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయడంతో పాటు లోయర్ ఆర్డర్ లో హిట్టింగ్ చేసే ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు బాగా ఆసక్తి చూపించారు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఈ లిస్టులో టాప్ లో ఉన్నారు. హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, గెరాల్డ్ కోయెట్జీ, శార్దూల్ ఠాకూర్ కు సైతం భారీ ధర పలికింది.
ఐపీఎల్ చరిత్రలోనే కమ్మిన్స్ అత్యధిక ధర
ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ భారీ ధర పలికాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. అతని కనీస ధర రూ. 2 కోట్లు కాగా, సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్లు వెచ్చించి అతన్ని దక్కించుకుంది. భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో కెప్టెన్ గా అదరగొట్టి ఆసీస్ ను విశ్వ విజేతగా నిలిపిన కమిన్స్ కు మంచి డిమాండ్ ఏర్పడింది.
క్రిస్ వోక్స్
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ ను రూ. 4.2 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. తొలిసారి వేలంలో పాల్గొన్న వోక్స్ కు ఇది చాలా పెద్ద మొత్తమనే చెప్పాలి.
డారిల్ మిచెల్ - రూ. 14 కోట్లు
కివీస్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్ రికార్డు ధర పలికాడు. అతని కనీస ధర కోటి రూపాయలు కాగా, చెన్నై సూపర్ కింగ్స్ రూ.14 కోట్లు వెచ్చించి అతన్ని దక్కించుకుంది. బ్యాటింగ్ ఆల్ రౌండర్ గా మిచెల్ వన్డే వరల్డ్ కప్ లో భారత్ పై రెండు సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. ఫార్మాట్ ఏదైనా టాప్ ఫామ్ లో ఉన్న మిచెల్ 14 కోట్లకు పలకడం హైలెట్ గా మారింది.
హర్షల్ పటేల్
మినీ వేలంలో భారత బౌలర్ హర్షల్ పటేల్ కోట్లు కొల్లగొట్టాడు. అతని కనీస ధర రూ. 2 కోట్లు కాగా, ఏకంగా రూ.11.75 కోట్లకు అమ్ముడుపోయాడు. అతని కోసం గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా.. చివరకు ఈ పోరులో కింగ్స్ ఓనర్ ప్రీతీ జింతా పైచేయి సాధించింది. బెంగళూరు జట్టు ఈ ఏడాది హర్షల్ పటేల్ ను వదిలేసుకున్నా.. ఈ బౌలింగ్ ఆల్ రౌండర్ కు అంతకు మించిన ధర దక్కింది.
ముంబైకి గెరాల్డ్ కోయెట్జీ
దక్షిణాఫ్రికా పేసర్ కోయెట్జీని నీతా అంబానీ ఆధ్వర్యంలోని ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. రూ. 5 కోట్లకు అతడు అమ్ముడుపోయాడు. దక్షిణాఫ్రికాకు చెందిన కోయెట్జీ సంవత్సరకాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. బౌలింగ్ వేరియషన్ తో పాటు లోయర్ ఆర్డర్ లో మెరుపులు మెరిపించగలడు.
అజ్మతుల్లా ఒమర్జాయ్
అఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్‌ను గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. రూ. 50 లక్షల కనీస ధరకే అతన్ని తీసుకుంది.
శార్దూల్ ఠాకూర్ చెన్నై సొంతం
భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. అతని కనీస ధర రూ. 2 కోట్లు కాగా, రూ. 4 కోట్లు పలికాడు.
రచిన్ రవీంద్ర కోసం మూడు జట్లు మధ్య పోటీ
రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన కివీస్ యువ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర కోసం మూడు జట్లు మధ్య పోటాపోటీ నడిచింది. అతన్ని చేజిక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ పోటీపడ్డాయి. చివరకు రూ. 1.8 కోట్లకు చెన్నై అతన్ని సొంతం చేసుకుంది.
వనిందు హసరంగా(ఎస్‌ఆర్‌హెచ్)
శ్రీలంక ఆల్ రౌండర్ వనిందు హసరంగా సన్ రైజర్స్ సొంతమయ్యాడు. రూ.1.5 కోట్ల ధరకు ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం అతన్ని కైవసం చేసుకుంది.