విద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తాం: మంత్రి పొంగులేటి

విద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తాం: మంత్రి పొంగులేటి
  • హెల్త్, ఎడ్యుకేషన్​కే టాప్ ప్రయారిటీ

  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి

  • ఎంజీఎంలో మందుల కొరతపై సీరియస్

  • వరంగల్  వెస్ట్  అభివృద్ధిపై మంత్రి కొండా సురేఖతో కలిసి రివ్యూ

హనుమకొండ, వెలుగు: హెల్త్, ఎడ్యుకేషన్​కు ప్రభుత్వం టాప్​ ప్రయారిటీ ఇస్తోందని ఉమ్మడి వరంగల్  జిల్లా ఇన్​చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు. వరంగల్​ ఎంజీఎంలో మందుల కొరత ఉండడం అవమానకరమన్నారు. పేదలకు మెడిసిన్​ అందించడంలో నిర్లక్ష్యంగా ఉంటే  సహించేది లేదని, మళ్లీ ఈ పరిస్థితి రిపీట్​ కావొద్దని ఆఫీసర్లకు వార్నింగ్​ ఇచ్చారు. 

మంత్రి కొండా సురేఖతో కలిసి ఎంజీఎంలో రూ.41 లక్షలతో ఏర్పాటు చేసిన సింగిల్  డోనర్  ప్లేట్లెట్స్  కౌంట్  మెషీన్ ను​ప్రారంభించారు. మందులు సరిపడా ఇవ్వడం లేదని పేషెంట్లు మంత్రికి  ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత జరిగిన వరంగల్  వెస్ట్  నియోజకవర్గ అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఎంజీఎంలో మందుల కొరతపై  పొంగులేటి అసహనం వ్యక్తం చేశారు. సీడీఎస్​లో 568 రకాల మందులకు గాను 521 రకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరణ ఇచ్చారు. ఎంజీఎంలో సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించి, 10 రోజులకోసారి రిపోర్ట్​ ఇవ్వాలని వరంగల్  కలెక్టర్  సత్యశారదను ఆదేశించారు. 

కబ్జాలు తొలగించుకోవాలి

నగరంలో చెరువులు, నాలాలు చాలా వరకు  కబ్జా అయ్యాయని, వరంగల్​కు హైడ్రా తరహాలో వాడ్రా తీసుకురావాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్​ రెడ్డి కోరారు. దీనిపై మంత్రి  పొంగులేటి స్పందిస్తూ  నగరంలో పేదలను అడ్డుపెట్టుకుని కొందరు పెద్దోళ్లు కబ్జాలు చేశారని, వాటిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. బఫర్​ జోన్లలో ఇండ్లు కట్టుకున్న వారిలో పేదలుంటే వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని సూచించారు. నాలాలను కబ్జా చేసిన బడా బాబులు సొంతంగా తొలగించుకోవాలని, లేదంటే ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 

అక్టోబర్​ 2న సీఎం రేవంత్​రెడ్డి కాళోజీ  కళాక్షేత్రాన్ని ప్రారంభించే అవకాశం ఉందని, ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. వరంగల్ రీజనల్​ సైన్స్​ సెంటర్​, ఐఆర్ఆర్​ భూసేకరణ, ఎయిర్​ పోర్టు, స్మార్ట్​ సిటీ, తదితర అంశాలపై చర్చించి, నగర అభివృద్ధికి సరిపడా నిధులు తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని, వరంగల్ జర్నలిస్టుల్లో సీనియారిటీని బట్టి అర్హులకు ఇండ్ల స్థలాలు ఇస్తామన్నారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య,  కుడా చైర్మన్​ ఇనుగాల వెంకట్రామ్​రెడ్డి, మేయర్  గుండు సుధారాణి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, గ్రేటర్​ కమిషనర్​ అశ్వినీ తానాజీ వాకడే పాల్గొన్నారు.