- 17 సార్లు ఎన్నికలు జరిగితే ముగ్గురు తెలంగాణవాళ్లకే చాన్స్
- జిల్లా వాసులకు ఇద్దరికే..
- ఈసారి అవకాశం దక్కేదెవరికో..?
ఖమ్మం, వెలుగు : ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎంపీల్లో ఎక్కువగా వలస లీడర్లే ఉన్నారు. ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగితే తెలంగాణ వాసులు ముగ్గురికే చాన్స్ దక్కింది. అందులో జిల్లావాసులు ఇద్దరు న్నామాత్రమే ఉరు. మిగతా వాళ్లంతా ఇతర ప్రాంతాలకు చెందివారు కాగా, అందులో ప్రధానంగా ఏపీకి చెందినవాళ్లే ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల సరిహద్దు ఉంటుంది. ఇంకోవైపు తెలంగాణలోని ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల సరిహద్దు ఉంటుంది. మన రాష్ట్రంతో పాటు ఏపీలోని జిల్లాల నుంచి వేలాది కుటుంబాలు ఖమ్మం వచ్చి స్థిరపడ్డాయి.
కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఆ పార్టీ వలస నేతలకు ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలను ఇచ్చింది. 17 సార్లు ఎన్నికలు జరిగితే 11సార్లు కాంగ్రెస్ గెలిచింది. గెలిచిన ప్రతీసారి వలస వచ్చిన వారే గెలుపొందారు. ఖమ్మం నుంచి మొదటి సారిగా లోక్ సభకు టీడీ విఠల్ రావు సీపీఐ నుంచి గెలుపొందారు. ఆ తరువాత లక్ష్మీకాంతమ్మ, జలగం కొండల్ రావు, జలగం వెంగళరావు, పీవీ రంగయ్య నాయుడు, నాదెండ్ల భాస్కర్ రావు, రేణుకచౌదరి కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఇందులో జలగం కొండల్ రావు, రేణుక చౌదరి ఇద్దరు రెండు సార్లు గెలుపొందారు. వీళ్లంతా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు.
అంతకుముందు టీడీపీ నుంచి గెలిచి, రెండోసారి బీఆర్ఎస్ నుంచి గెలిచి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావు పుట్టిన ఊరు ఉమ్మడి వరంగల్ జిల్లా బలపాల. వ్యాపారపరంగా ఆయన ఖమ్మం వచ్చి సెటిలయ్యారు. సీపీఎం తరపున గెలిచిన తమ్మినేని వీరభద్రం స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి కాగా, వైసీపీ తరపున ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సొంతూరు కల్లూరు మండలం నారాయణపురం. వీరిద్దరు మాత్రమే ఖమ్మం జిల్లాకు చెందివారు. .
ఈసారి ఎవరిని వరించునో..
ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరపున టికెట్ ఆశిస్తున్న వారిలో ఇతర ప్రాంతాలకు చెందిన లీడర్లున్నారు. టికెట్ కోసం అప్లయ్ చేసుకున్న వారిలో ఖమ్మం ఆడబిడ్డగా చెప్పుకునే రేణుకాచౌదరికి ఇప్పటికే కాంగ్రెస్ రాజ్యసభ అవకాశం కల్పించింది. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు హైదరాబాద్ కు చెందిన వారు కాగా, మల్లు నందిని గుజరాత్ కు చెందిన మర్వాడి కుటుంబానికి చెందిన మహిళ. ఆమె మాత్రం డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క సతీమణి కావడంతో ఖమ్మం జిల్లా కోడలుగా రంగంలో ఉన్నారు. ఇక ఖమ్మం జిల్లాకు చెందిన వారిలో పొంగులేటి ప్రసాద్‌రెడ్డి, వీవీసీ రాజేంద్రప్రసాద్ఉన్నారు. అయితే ఈసారి చాన్స్ వలస లీడర్లకు వస్తుందా, లేదా అనేది చూడాల్సి ఉంది.