- అర్హత ఉన్నా పింఛన్ మంజూరు కాలేదంటున్న ప్రజలు
- బతికున్నా చనిపోయావంటున్నారని ఆవేదన
సూర్యాపేట, వెలుగు : అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న వారు ఇక తమకు పించన్ వచ్చినట్టేనని ఎంతో సంతోషించారు. కానీ తీరా లిస్ట్ విడుదల అయ్యాక అందులో తమ పేరు లేకపోవడంతో మండల ఆఫీసర్ల చుట్టూ తిరిగారు. అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో కలెక్టరేట్‌లో జరిగే గ్రీవెన్స్‌లో నేరుగా కలెక్టర్‌కే ఫిర్యాదు చేస్తున్నారు. ‘తాము బతికే ఉన్నాం.. తమకు అన్ని అర్హతలు ఉన్నాయి.. అవసరమైన సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి.. దయచేసి మాకు పింఛన్లు మంజూరు చేయండి’ అంటూ ఆఫీసర్లను వేడుకుంటున్నారు.
ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే రిజక్ట్ చేసిన్రు
ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేయడంతో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 20 వేల మందికి పింఛన్లు వచ్చాయి. మరో ఆరు వేల మంది అప్లికేషన్లను ఆఫీసర్లు రిజక్ట్ చేశారు. అయితే ఈ అప్లికేషన్లను వెరిఫై చేయకుండానే ఆఫీసర్ల రిజక్ట్ చేసినట్లు తెలుస్తోంది. బతికున్న వారిని చనిపోయినట్లుగా చూపుతూ, 70 ఏండ్లు దాటిన వారు కూడా అర్హులు కాదంటూ రిజక్ట్ చేయడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. దీంతో తమకు పింఛన్లు మంజూరు చేయాలని బాధితులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో గతంలో ధరణిపైనే ఎక్కువ ఫిర్యాదులు అందేవి. కానీ రెండు వారాల నుంచి పింఛన్ల ఫిర్యాదులే ఎక్కువగా వస్తున్నాయి. సోమవారం సూర్యాపేటలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో 37 అర్జీలు రాగా, ఇందులో సగానికిపైగా పింఛన్‌కు సంబంధించినవే కావడం గమనార్హం.
అర్జీలను త్వరగా పరిష్కరించాలి
ప్రజావాణిలో వచ్చే అర్జీలను త్వరగా పరిష్కరించాలని సూర్యాపేట అడిషనల్ కలెక్టర్ ఎస్.మోహన్‌రావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీదారులు భూములకు సంబంధించిన వివరాలను మీ–సేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. గ్రీవెన్స్‌డేలో మొత్తం 37 అర్జీలు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో డీఏవో రామారావునాయక్, వెల్ఫేర్ ఆఫీసర్లు శంకర్, జ్యోతి పద్మ, ఏవో శ్రీదేవి పాల్గొన్నారు.
నేను చనిపోయానట
నేను వృద్ధాప్య పింఛన్ కోసం నాలుగేండ్ల కింద అప్లై చేసుకున్నా. ఇటీవల ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేసినా నాకు మాత్రం రాలేదు. ఎంపీడీవో ఆఫీస్‌కు వెళ్లి అడిగితే నేను చనిపోయినట్లు రికార్డులో ఉందన్నారు. పింఛన్ కోసం నాలుగేండ్ల నుంచి ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా. వివరాలు తెలుసుకోకుండానే ఎలా రిజక్ట్ చేస్తారు.
– చింతలచెర్వు పద్మ,
పాలకీడు మండలం
అందరికీ వచ్చినా నాకు రాలే
నాకు రెండు కండ్లు కనిపించవు. సదరం క్యాంప్‌లో నాతో పాటు అప్లై చేసుకున్న వారికి పింఛన్ మంజూరైంది. నాకు మాత్రం ఇవ్వలేదు. ఆఫీసర్లను అడిగితే మాకు తెలియదు అంటున్నారు. మరోసారి అప్లై చేసుకోవాలని చెబుతున్నారు.
– బత్తిని కాశమ్మ, పోలేనిగూడెం, చిలుకూరు మండలం
యాదాద్రి గ్రీవెన్స్‌లో 20 ఫిర్యాదులు
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 20 ఫిర్యాదులు అందాయి. ఆలేరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ స్టూడెంట్లను పట్టించుకోవడం లేదని పలువురు కలెక్టర్ పమేలా సత్పతికి ఫిర్యాదు చేశారు. అలాగే ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల్లో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి 12, మున్సిపాలిటీకి చెందినవి 3, ఎంపీడీవోలపై రెండు ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు డి.శ్రీనివాస్‌రెడ్డి, దీపక్ తివారి, ఏవో నాగేశ్వరాచారి పాల్గొన్నారు.