టెక్స్​టైల్స్​లో కోటి జాబ్స్ ఏవి.?

టెక్స్​టైల్స్​లో కోటి జాబ్స్ ఏవి.?

భారతదేశంలో వ్యవసాయ క్షేత్రం అనంతరం టెక్స్​టైల్స్ విభాగంలోనే అత్యధికంగా ఉపాధికి అవకాశాలు ఉంటాయి.  సుమారు10 కోట్ల మందికి సంబంధించిన విభాగం ఇది.  టెక్స్​టైల్స్​లో 2014 నుంచి పరిశీలించినట్లు అయితే బడ్జెట్ వేల కోట్లలో  కేటాయిస్తున్నారు. దీనిలాభం టెక్స్​టైల్స్​లో  మేనేజ్​మెంట్​కే వస్తుందా? లేక ఉద్యోగులకు కూడా వస్తుందా? ఈ విభాగంలో కొత్తగా ఉద్యోగాలు వచ్చాయా.. ప్రభుత్వం కొత్త ఉద్యోగాల కల్పన ప్రకటన చేసిన తర్వాత ఎంతమందిని భర్తీ చేశారనే  డేటా మాత్రం ప్రకటించలేదు. డేటా అప్డేట్ చేయలేదని ఒకరు,  చేస్తున్నామని కొందరు,  అసలు డేటానే లేదు.. చెప్పలేమని  కొందరు మంత్రులు ప్రకటించడం విశేషం. వ్యవసాయం తర్వాత భారీ ఉద్యోగ అవకాశాలు లభించే టెక్స్​టైల్స్​విభాగం పాలకుల ఉదాసీనత వల్ల  నిర్వీర్యం అవుతున్నది. 2016 నుంచి2020 వరకు రూ.17,822 కోట్ల బడ్జెట్ కేటాయించారు. బడ్జెట్ ఖర్చుకు సంబంధించి అసలు చెప్పేవారు లేరు.  కానీ, చెప్పిన గణాంకాలనే  పదే పదే పాత లెక్కలను  కొత్త కవర్లో పెట్టి చూపే మాదిరి చెప్పేస్తూ ఉంటారు.  ఒకప్పుడు భారత దేశం నుంచి చైనా కాటన్ కొనుగోలు చేసేది.. ఇప్పుడు చైనా వియత్నాం నుంచి తీసుకుంటున్నది.

Also Read :- రేవంత్​ టార్గెట్​గా బీఆర్​ఎస్​ పావులు.!

ఉద్యోగాల భర్తీపై ఉదాసీనత

బంగ్లాదేశ్ లో టెక్స్​టైల్స్​లో మన దేశం కన్నా మంచి ప్లేస్ లో ఉంది.  ప్రపంచ మార్కెట్ లో కాటన్ రేట్లలో మన కాటన్ ధర15 శాతం ఎక్కువ కావడం వల్ల మార్కెట్ పడిపోయిందంటారు. కెపాసిటీ రిడక్షన్ వల్ల35 శాతం మైనస్ లోనికి వచ్చాం అంటారు.  ప్రభుత్వ ప్యాకేజీలు ఎవరికి లాభం చేకూర్చుతున్నాయో అంతు చిక్కని విషయం. 2016 జూన్ 22న ప్రభుత్వ 1.1 కోట్ల ఉద్యోగాలు టెక్స్​టైల్స్​లో భర్తీ  కానున్నాయని ప్రకటించింది. రూ.6000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు. మరోసారి కేంద్రం రూ.10,683కోట్ల  రూపాయల ప్యాకేజీ ప్రకటించింది.  దీని ద్వారా7.5లక్షల ఉద్యోగాల అవకాశం ఉంటుంది అని పేర్కొనడం జరిగింది.  మార్చి12, 2020లో అప్పటి మంత్రి స్మృతి ఇరానీ  టెక్స్​టైల్స్​లో 1.11 కోట్ల ఉద్యోగాలు రానున్నాయని పేర్కొన్నారు.  వాస్తవానికి  2016 జూన్ 22న కేంద్రం ప్రకటించిన వివరాలనే మంత్రి మరోసారి ప్రకటించారు. అప్పుడు మంత్రి ఉద్యోగాల డేటా గతంలో లేదని తాము ఇప్పుడు డేటాను రెస్యూమ్ చేస్తున్నామన్నారు. 2016లో 1.1కోట్ల ఉద్యోగాలు.. రిపీట్ లో1.11కోట్ల ఉద్యోగాలు అయ్యాయి.  మరో10లక్షలు పెంచి గతంలో అప్పటి మంత్రి ప్రకటించారు.  అసలు2016లో  ప్రకటించిన1.1కోట్ల ఉద్యోగాల సంగతి ఏమైందో? ఎవరూ చెప్పలేదు.  2020లో అప్పటి మంత్రి, ప్రకటన పాత లెక్కలు కొత్త కవర్లో మాదిరి ఉన్నాయి.

35శాతం టెక్స్​టైల్స్ ఇండస్ట్రీ నిర్వీర్యం

టెక్స్​టైల్స్ పరిశ్రమలో యజమానులు,  సంఘాల స్టేట్​మెంట్​  ప్రకారం 50 లక్షల మందికి పైగా కరోనాకు ముందే ఉద్యోగాలు కోల్పోయారు.  కొన్ని రాష్ట్రాల్లో అధిక విద్యుత్ చార్జీల కారణంగా.. కాటన్ ధరలు15శాతం ఇతర దేశాలకన్నా ఎక్కువ ఉండడం వల్ల స్పిన్నింగ్ మిల్లులు నడవలేని పరిస్థితి ఏర్పడింది. 35శాతం టెక్స్​టైల్స్ ఇండస్ట్రీ నిర్వీర్యం అయింది.  ఆగస్టు 2019లో  ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికలో తమ సంకట పరిస్థితిని వివరిస్తూ టెక్స్​టైల్స్​వర్గాలు పెద్ద ప్రకటన జారీ చేశారు. అందులో నష్టాలను వివరించారు. 30 నుంచి35శాతం ఉత్పత్తి నిలిపివేశారు.  జనవరి 2021లో  26 నుంచి35శాతం తగ్గినట్లు కూడా రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి.  పత్తి ఉత్పత్తి ఎక్కువ జరుగుతున్నప్పటికీ  కొనుగోళ్లు  ప్రభుత్వ విధానాలు ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే పరిస్థితి విషమంగా మారే అవకాశం ఉంది.  టెక్స్​టైల్స్ రంగం  కేంద్ర ప్రభుత్వానికి ఆటలా మారింది.  అందుకే  ఎక్కడికక్కడ  మంత్రులు, అధికారుల ప్రకటనకు  పొంతన కనబడటం లేదు.  బడ్జెట్ గురించి చెప్పేవారు ఖర్చు గురించి చెప్పడం లేదు. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అని లెక్కలు చెప్పేవారు పదిఏండ్లలో ఎన్ని భర్తీలు జరిగాయో లెక్కలు చెప్పడం లేదు. ఈ మొత్తంగా పరిస్థితిని ప్యాకేజీల  ప్రకటనను డేటానే లేనపుడు ఏమనుకోవాలి? 2024– --25 బడ్జెట్ లో  టెక్స్​టైల్స్ కు 4,417  కోట్ల రూపాయలు కేటాయించారు. 2023-–-24 లో  రూ. 3,443 కోట్లు కేటాయించగా ఈ సారి 974 కోట్లు పెంచారు. కానీ, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంలా టెక్స్​టైల్స్ పరిస్థితి ఉన్నది.

- ఎండి. మునీర్