
ఆలూరు.. ఖాకీ కొలువులకు పెట్టింది పేరు. అక్కడ ఇంటికో పోలీస్ ఉన్నాడంటే అతిశయోక్తి కాదు. ఆ ఊరి నుంచి ఇప్పటికే 450 మంది పోలీసు విభాగంలో కొలువు దీరారు. తాజాగా విడుదలైన కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఫలితాల్లో ఈ ఊరి నుంచి 30 మంది ఒకేసారి సెలెక్టయ్యారు. ఆ ఊరుకున్న ప్రత్యేకతను మరోసారి చాటిచెప్పారు. ఇంటర్ పూర్తయిన వారెవరిని కదిలించినా.. పోలీస్ కావాలనే పట్టుదలే యువతీ యువకులనే తేడా లేకుండా తెల్లారగానే రన్నింగ్.. స్కూల్ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ పొద్దంతా పుస్తకాలతో కుస్తీ.. సీనియర్ల సలహాలు, సూచనలే వారి ఆస్తి పిల్లలు పెద్దలూ వాళ్లను ఎంకరేజ్ చేస్తారు. అదే ఆ ఊరి సక్సెస్ ఫార్ములా. ఇప్పటివరకు ఈ ఊరి నుంచి సెలెక్టయిన పోలీసులందరూ కలిసి కదిలితే.. కవాతే..
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గ్రామం అంటే గుర్తొచ్చేది అక్కడి పోలీసులే. చిన్నప్పటి నుంచే పోలీస్ జాబ్ కొట్టాలనే కసితో అక్కడి పిల్లలు చదువుతరు. కోచింగ్ వెళ్లేవాళ్లు కొంత మంది.. ఇంటి దగ్గరే ప్రిపేరయ్యేవాళ్లు కొంతమంది. జాబ్ కొట్టిన సీనియర్లు గైడెన్స్ ఇస్తరు. వారు చెప్పిన సూచనలు ఇక్కడి అభ్యర్థులు పాటిస్తరు. నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ, పుస్తకాలు చేతపట్టుకుని కన్పిస్తరు. ఊరి స్కూల్ గ్రౌండ్‌లోనే అంతా కలిసిమెలిసి ప్రాక్టీస్ చేస్తరు. ప్రతి రోజు మార్నింగ్, ఈవినింగ్ తప్పనిసరిగా వాలీబాల్, ఫుట్‌బాల్, ఖోఖో, లాంగ్ జంప్, హై జంప్, కబడ్డీ తదితర ఆటలు ఆడుతరు. హైదరాబాద్ రోడ్డు నుంచి ఆలూరు ఊరి వరకు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రతిరోజూ 3 కిలోమీటర్ల దూరం పరిగెత్తుతారు. వీరికి ఏ డౌట్ ఉన్నా ఊరిలో ఇంతకుముందు పోలీస్ జాబ్ కొట్టిన సీనియర్లు గైడ్ చేస్తరు. నోటిఫికేషన్ వస్తుందన్న సమాచారం అందితే చాలు ఇక్కడి యువకులకు ఫిజికల్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తరు. ఇప్పటికే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నవారు వీరికి ఈవెంట్స్‌లో ఎలా మెరిట్ సాధించాలో నేర్పిస్తరు. ఇదంతా ఈవెంట్స్‌కు ఆరునెలల నుంచే మొదలైతది.
1989 నుంచి మొదలు..
1989 నుంచి నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి ఇక్కడి నుంచి పోలీస్ ఉద్యోగాలకు ఎంపికవుతూనే ఉన్నారు. కానిస్టేబుల్ నుంచి ఏసీపీ వరకు వివిధ హోదాల్లో పనిచేస్తున్నవారున్నరు. గత మూడు, నాలుగేండ్లలో విడుదలైన నోటిఫికేషన్లలో 41 మంది పోలీసులుగా ఎంపికయ్యారు. ఈ ఏడాది మాత్రం ఒకేసారి 30మంది కానిస్టేబుల్స్‌గా సెలెక్టయ్యారు.
జాబ్ కొట్టిన విజేతలు..
నరేష్, మహేష్, శివకుమార్, శివరాజ్, కొండకల్ల శ్రీను, వడ్ల రాఘవేంద్రచారి, వడ్ల ప్రవీణ్‌చారి, నడికుడి నరేందర్, చాకలి జంగయ్య, చిడిగిద్ద శ్రీను, ఖాదర్ పాషా, ఖదీర్ పాషా, పోలపల్లి కిరణ్, శ్రీకాంత్‌రెడ్డి, పరిగి గోపాల్, టి.నర్సింగ్, టి.సతీష్, టి.అనిల్, బి.ప్రభాకర్, నడికుడి ధోని, అసద్ పాషా , కమ్మెట శివ, మొక్రం ప్రశాంత్ కుమార్, వడ్డె భువనేశ్వరి, టి.మనీల, పరిగి అమూల్య, మోకిల సరిత, పొట్ట సబిత , కోరె శ్రీవాణి, మంగలి జయలక్ష్మి.
మా ఇంట్లో ఫస్ట్ జాబ్ నాదే..
మేం అయిదుగురం అక్కాచెల్లెళ్లం. అందరిలో నేనే చిన్నదానిని. నాన్న నారాయణ రన్నింగ్‌లో స్టేట్ ఫస్ట్. ఆయనని ఆదర్శంగా తీసుకునే పోలీస్ ఈవెంట్స్ క్లియర్ చేశా. నాకు జాబ్ రావడానికి మా నాన్నే కారణమని చెప్పొచ్చు. డిగ్రీ పూర్తయ్యే టైంలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. జాబ్ కొట్టాలనే ఏకైక లక్ష్యంతో ప్రిపేరయ్యా. – శ్రీవాణి
ఇంటర్ కాగానే జాబ్..
నాన్న చనిపోవడంతో అమ్మనే మాకు అన్ని దగ్గరుండి చూసుకుంది. నాతో పాటు తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. స్కూల్‌లో చదివేటప్పుడు ఫీజు కట్టలేని పరిస్థితులున్నా చదువును మధ్యలో ఆపొద్దని టీచర్లు ప్రోత్సహించేవారు. 2018లో ఇంటర్ పూర్తయింది. అప్పుడే కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడంతో అప్లై చేశా. 18 ఏండ్లకే నేను సర్కారు కొలువు కొట్టా. – ప్రభాకర్
రెండోసారికి కొట్టా
అన్న ఆటో నడుపుతాడు.. తమ్ముడు స్కూలు బస్సు నడుపుతాడు. వారు కష్టపడుతూనే నన్ను చదివించారు. మాలా నువ్వు కష్టపడొద్దు.. పోలీస్ జాబ్ కొట్టాలిరా అని మా అన్న ఎప్పుడూ చెబుతుండేవాడు. అలా ఫస్ట్ టైం రాసినప్పుడు క్వాలిఫై కాలేకపోయా. రెండోసారి పట్టుదలతో చదివా. ఈసారి మిస్ అవ్వలేదు. – శివరాజ్
ఒక్క మార్కుతో మిస్సయింది
చిన్నప్పటినుంచి ఆటలంటే చాలా ఇష్టం. సీనియర్లతో కలిసి మా స్కూల్ గ్రౌండ్‌లో ఉదయం, సాయంత్రం ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసేవాణ్ని. ఫస్ట్ టైం రాసినప్పుడు ఒక్క మార్కుతో జాబ్ మిస్సయింది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకున్న. మ్యాథ్స్ చాలా టఫ్‌గా అన్పిస్తది. కానీ కోచింగ్ తీసుకోవడం వల్ల ఈజీ అయింది. అందుకే సెకండ్ టైం మిస్సవ్వలేదు. – సతీష్‌కుమార్