
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఏళ్లుగా పోడు భూముల్లో పంటలేసుకుంటున్న రైతులకు పట్టాలిస్తం. వీటిని వచ్చే ఫిబ్రవరిలోనే అందిస్తం. సాగుదారులకు హక్కు కల్పిస్తం. ఇకనుంచి సాగుదారులకు ఫారెస్టు సిబ్బందికి తగువులు ఉండవ్ అంటు సీఎం కేసీఆర్అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ పత్తా లేకుండా పోయింది. ఇచ్చిన హామీ సర్కారు మర్చిపోయిందేమోనన్న అనుమానాలు సాగుదారుల్లో కలుగుతున్నాయి. మే నెల సగం అయిపోయినా సీఎం హామీకి అతీగతీ లేకుండా పోయింది. ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హామీల మాదిరిగానే ఇది కూడా మరుగున పడుతుందేమోనన్న భయం కూడా గిరిజన రైతుల్లో వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పోడు భూములకు పట్టాలిస్తామంటూ ఆదివాసీలను ఊరిస్తూ కాలం వెళ్లదీస్తోంది.
రాష్ట్రంలోనే అత్యధిక దరఖాస్తులు ఇక్కడే..
మరికొద్ది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. పోడు భూములకు సీఎం ఇస్తానన్నా పట్టాల పంపిణీ మాటలకే పరిమితమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఈసారి కూడా పోడు సాగుదారులకు, ఫారెస్ట్ఆఫీసర్లకు ఘర్షణలు తప్పేలా లేవు. పంటలు వేయాలా వద్దా అనే మీమాంసలో రైతులు పడిపోయారు. రాష్ట్రంలోనే అధికంగా భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో దాదాపు 44వేల మంది పోడు సాగుదారులకు పట్టాలు పంపిణీ చేసేందుకు ప్లాన్చేశామని ఆఫీసర్లు ఇప్పటికే పలుమార్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,845 జీపీల నుంచి 11,55,849 ఎకరాలకు సంబంధించి 3,94,996 క్లెయిమ్లు వచ్చాయి. దాదాపు 7.19లక్షల ఎకరాలకు 2.23లక్షల క్లెయిమ్లు గిరిజనుల నుంచి వస్తే 4.36లక్షల ఎకరాలకు1.71లక్షల మంది గిరిజనేతరులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రామ, మండల, డివిజన్, జిల్లాస్థాయిలో పరిశీలన అనంతరం దాదాపు 4లక్షల ఎకరాలకు పైగా 1.55లక్షల మంది గిరిజనులను గుర్తించారు.
ఏర్పాట్లు చేసినా కార్యాచరణ కాలేదు..
దాదాపు 4లక్షల ఎకరాల్లో 1.55లక్షల మంది పోడు సాగుదారులకు రాష్ట్ర వ్యాప్తంగా పట్టాల పంపిణీకి సర్కారు సిద్ధమైంది. ఈ క్రమంలోనే పోడు పట్టాల ను ముద్రించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు55వేల మంది, ఆదిలాబాద్లో దాదాపు33వేలు, వరంగల్లో 32వేలు, నిజామాబాద్లో 7,500 మంది, మహబూబ్నగర్లో 3,500 మంది, కరీంనగర్లో 3,450 మంది, నల్గొండలో 2,800 మంది, మెదక్లో 2,800 మందిని ఆఫీసర్లు గుర్తించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో దాదాపు 44వేల మందికి పోడు పట్టాలిచ్చేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి నెలాఖరులో పోడు పట్టాలు అందిస్తామని సీఎం చెప్పడంతో ఆదివాసీల్లో ఆనందం వెల్లివెరిసింది. కానీ ఇది మరుగున పడడంతో పోడు సాగుదారులు, ఆదివాసీల్లో అసలు పట్టాలను ఇస్తారా లేదా అనే చర్చ సాగుతోంది.
ఇటు అధికార పార్టీ.. అటు ఉన్నతాధికారులు..
నైరుతి రుతుపవనాలు మరికొద్ది రోజుల్లో రానుండడంతో ఆదివాసీలు పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. హరితహారం, అడవుల అభివృద్ధిలో భాగంగా మొక్కలను పెద్ద సంఖ్యలో పెంచేందుకు ఫారెస్ట్డిపార్ట్ మెంట్ ప్రణాళికలు వేస్తోంది. దీంతో ఎప్పటి మాదిరిగానే పోడు సాగుదారులకు, ఫారెస్ట్వాళ్లకు ఘర్షణలు తలెత్తే లేకపోలేదని రైతు సంఘాల లీడర్లు అంటున్నారు. జిల్లాలోని చిట్టి రామారంలో ఓ గిరిజన మహిళ ఫారెస్ట్ ఆఫీసర్ల దాడిలో స్పృహ తప్పి పడిపోవడం, పలువురు గాయాలపాలైన ఘటనలున్నాయి. ఇల్లెందు, టేకులపల్లి, అశ్వారావుపేట, అన్నపురెడ్డిపల్లి, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, ముల్కలపల్లి, చండ్రుగొండ వంటి ప్రాంతాల్లో పోడు భూములపై ఇప్పటికీ ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది.
లక్ష్మీదేవిపల్లి మండలంలో పోడు సాగు విషయంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై ఫారెస్ట్ ఆఫీసర్లు కేసు నమోదు చేశారు. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఏంచేయాలో, ఎలా ముందుకు సాగాలో అర్థం కాని పరిస్థితిలో ఫారెస్ట్ఆఫీసర్లున్నారు. పోడు సాగును అడ్డుకుంటే అధికార పార్టీ నుంచి తీవ్రస్థాయిలో బెదిరింపులు వస్తున్నాయి. ఆపకుంటే ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ తరుణంలో రానున్న సీజన్లో పోడు సాగుదారుల నుంచి ప్రతిఘటనలు ఎదురవుతాయని ఫారెస్ట్ సిబ్బంది వాపోతున్నారు.