Champions Trophy 2025: రచీన్ రవీంద్రకే గోల్డెన్ బ్యాట్.. అత్యధిక పరుగుల వీరులు వీరే!

Champions Trophy 2025: రచీన్ రవీంద్రకే గోల్డెన్ బ్యాట్.. అత్యధిక పరుగుల వీరులు వీరే!

అభిమానులను 20 రోజులుగా అలరిస్తూ వస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఆదివారం (మార్చి 9) ముగిసింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది. ఈ టోర్నమెంట్ లో పాకిస్థాన్ లో జరిగిన మ్యాచ్ లన్ని పరుగుల వరద పారగా.. దుబాయ్ లో మాత్రం బౌలర్లదే పై చేయి. ఈ టోర్నమెంట్ లో అత్యధిక పరుగుల వీరులు ఎవరో ఇప్పుడు చూద్దాం.           

1) రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్): న్యూజిలాండ్ యువ ఆల్ రౌండర్ రచీన్ రవీంద్ర ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించి గోల్డెన్ బ్యాట్ గెలుచుకున్నాడు. టోర్నీ తొలి మ్యాచ్ ఆడకపోయినా ఈ కివీస్ ఓపెనర్ టాప్ రన్ స్కోరర్ గా నిలవడం విశేషం. మొత్తం నాలుగు మ్యాచ్ ల్లో 65 యావరేజ్ తో 263 పరుగులు చేశాడు. వీటిలో రెండు సెంచరీలు ఉన్నాయి.

2) శ్రేయాస్ అయ్యర్ (ఇండియా ): ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్ లో టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ రెండో స్థానంలో నిలిచాడు. మిడిల్ ఆర్డర్ లో కీలక ఇన్నింగ్స్ లు ఆడుతూ మొత్తం 5 మ్యాచ్ ల్లో 60 యావరేజ్ తో 263 పరుగులు చేశాడు. వీటిలో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫైనల్లో 48 పరుగులు చేసిన అయ్యర్ మరో 21 పరుగులు చేసి ఉంటే గోల్డెన్ బ్యాట్ గెలుచుకునేవాడు. 

Also Read : రూ.6 కోట్ల కంటే దేశమే ముఖ్యం

3)బెన్ డకెట్(ఇంగ్లాండ్): ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ ఫైనల్ కు ముందు వరకు 227 రన్స్ తో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్ లో టాప్ లో ఉన్నాడు. మూడు మ్యాచ్ ల్లోనే ఈ ఇంగ్లీష్ ఓపెనర్  75.66  సగటుతో  227 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై జరిగిన లీగ్ మ్యాచ్ లో అతను 165 పరుగుల మారథాన్  ఇన్నింగ్స్ ఆడాడు. 

4) జో రూట్ (ఇంగ్లాండ్): ఇంగ్లాండ్ వెటరన్ ఆటగాడు జో రూట్ ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. జట్టు కోసం కీలక ఇన్నింగ్స్ లు ఆడినా మ్యాచ్ లు గెలిపించలేకపోయాడు. 3 ఇన్నింగ్స్ ల్లో 75 యావరేజ్ తో 225 పరుగులు చేసి నాలుగో స్థానంలో నిలిచాడు. వీటిలో ఆఫ్ఘనిస్తాన్ పై లీగ్ దశలో చేసిన సెంచరీ కూడా ఉంది. 

5) విరాట్ కోహ్లీ(ఇండియా): టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కోహ్లీ తన హవా చూపిస్తున్నాడు. పాకిస్థాన్ పై విరాట్ అజేయ శతకం సాధించాడు. 5 ఇన్నింగ్స్ ల్లో కోహ్లి 54.50 సగటుతో 218 పరుగులు చేశాడు. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై 84 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఫైనల్లో మాత్రం ఒక పరుగు మాత్రమే చేసి టాప్ 5 తో సరిపెట్టుకున్నాడు. 

ఇబ్రహీం జద్రాన్ (216). టామ్ లేతమ్ (205), కేన్ విలియంసన్ (200),వాండర్ డస్సెన్ (193),శుభమాన్ గిల్(188) వరుసగా 6,7,8,9,10 స్థానాల్లో నిలిచారు.