అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ మహాసమరం మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. శనివారం (జూన్ 1)తో వార్మప్ మ్యాచ్‌లు ముగియనుండగా.. ఆదివారం(జూన్ 2) ఉదయం 6 గంటల నుంచి అసలు మ్యాచ్‌లు షురూ కానున్నాయి. తొలి మ్యాచ్‌లో అమెరికా.. కెనడాతో తలపడనుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లెవరో ఇప్పుడు చూద్దాం.
విరాట్ కోహ్లీ:
సహజంగానే సూపర్ ఫామ్ లో ఉండే విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ అంటే పూనకం వచ్చినట్టు ఆడతాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. విరాట్ 27 మ్యాచ్ ల్లో 1141 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 131 ఉంటే.. యావరేజ్ 81గా ఉంది. చివరిసారిగా జరిగిన వరల్డ్ కప్ లో కోహ్లీ 296 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
మహేల జయవర్ధనే:
శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే రెండో స్థానంలో నిలిచాడు. మొత్తం 31 ఇన్నింగ్స్ ల్లో 1016 పరుగులు చేశాడు. టీ20 వరల్డ్ కప్ లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ప్లేయర్ గా జయవర్ధనే రికార్డ్ సృష్టించాడు. అతని స్ట్రైక్ రేట్ 134 అయితే యావరేజ్ 39.
క్రిస్ గేల్:
ప్రపంచ క్రికెట్ లో విధ్వంసవీరుడిగా పేరు గాంచిన వెస్టిండీస్ మాజీ ఓపెనర్ ఈ లిస్టులో మూడో స్థానంలో ఉన్నాడు. 33 ఇన్నింగ్స్ ల్లో 965 పరుగులు చేశాడు. యావరేజ్ 34 గా ఉంటే.. అతని స్ట్రైక్ రేట్ 141 గా ఉంది.
రోహిత్ శర్మ:
ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 965 పరుగులతో ఈ లిస్టులో నాలుగో స్థానంలో నిలిచాడు. హిట్ మ్యాన్ స్ట్రైక్ రేట్ 127 ఉంటే యావరేజ్ 34. తొలి ఎడిషన్ 2007 నుంచి రోహిత్ ప్రతి వరల్డ్ కప్ ఆడడం విశేషం.
తిలకరత్నే దిల్షాన్:
శ్రీలంక మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ తిలకరత్నే దిల్షాన్ 897 పరుగులతో ఐదో స్థానంలో నిలిచాడు. దిల్షాన్ స్ట్రైక్ రేట్ 124 ఉంటే.. యావరేజ్ 30.
డేవిడ్ వార్నర్ (806), జోస్ బట్లర్(799),షకీబ్ అల్ హసన్(742), AB డివిలియర్స్(717),కేన్ విలియమ్సన్ (699) వరుసగా 6,7,8,9, 10 స్థానాల్లో నిలిచారు.