ఏసీ బస్సులే కావాలి! తేల్చి చెప్పిన ఐటీ ఎంప్లాయీస్​

  • ఎలాంటి బస్సుల్లో వెళ్లడానికి ఇష్టపడతారంటూ ఆర్టీసీ సర్వే 
  • ఏసీ బస్సులైతే రిలాక్సుడ్​గా ఉంటుందని, అలసట ఉండదన్న ఉద్యోగులు   
  • అభిప్రాయాలకు తగ్గట్టుగా ఏసీ బస్సులు పెంచే యోచనలో ఆర్టీసీ అధికారులు

హైదరాబాద్, వెలుగు: ఐటీ కారిడార్​లోని వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న సాఫ్ట్​వేర్​ఎంప్లాయీస్​లో ఎక్కువ మంది ఏసీ బస్సులు, లగ్జరీ బస్సులకే ప్రాధాన్యతనిస్తున్నారు. ఆఫీసులకు వెళ్లేప్పుడు, గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చొని పని చేశాక ఇండ్లకు వెళ్లేప్పుడు ఎలాంటి బస్సుల్లో వెళ్తారని ప్రశ్నిస్తే ఎసీ, లగ్జరీ బస్సుల్లో వెళ్తేనే కాస్త రిలాక్సుడ్​గా ఉంటుందని సమాధానమిస్తున్నారు. దీంతో వారి అభిప్రాయాలకు తగ్గట్టుగా బస్సులను సర్ధుబాటు చేసేందుకు అధికారులు ప్లాన్​చేస్తున్నారు.

 ఆర్టీసీ సర్వే ఎందుకంటే..

ఎక్కువ ఆదాయాన్ని అందించే రూట్లలోనే ఎక్కువ బస్సులు నడపాలన్న లక్ష్యంతో గ్రేటర్ ఆర్టీసీ అధికారులు పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో కొత్త బస్సులను ముఖ్యంగా ఎలక్ట్రిక్​ బస్సులను ప్రవేశ పెడుతున్న ఆర్టీసీ లాంగ్​రూట్లతో పాటు ఐటీ కారిడార్ పైనా దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాల నుంచి ఐటీ ఉద్యోగులు ఐటీ కారిడార్​ వైపు వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకునేందుకు అధికారులు ప్రత్యేకంగా ఆన్​లైన్​ సర్వే నిర్వహిస్తున్నారు. ఐటీ ఉద్యోగుల కోసం యాప్​ను సిద్ధం చేసి వారికి అందుబాటులో ఉంచారు. 

ఈ సర్వేలో పలు ప్రశ్నలు అడుగుతన్నారు. సొంత వాహనాల కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు ఎంత మంది ఉన్నారు?  ఏఏ ప్రాంతాల నుంచి..ఎంత దూరం నుంచి వస్తున్నారు? ఏసీ బస్సులకు ప్రాధాన్యత ఇస్తారా? లేక నాన్​ఏసీలకా? వారంలో ఎన్నిసార్లు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు? వంటి ప్రశ్నలు వేసి సమాధానాలు తెలుసుకుంటున్నారు. 

తాము రెగ్యులర్​గా క్యాబ్స్​తో పాటు పర్సనల్​వెహికల్స్​లో ఆఫీసులకు వచ్చి పోతూ ఉంటామని, ఒకవేళ తమ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు నడిపితే ఏసీ బస్సులు, లగ్జరీ బస్సులకే ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారు. ఆఫీసుకు వెళ్లేప్పుడు నార్మల్​బస్సులయితే అలసిపోతామని, ఆఫీసులో పని చేశాక సాధారణ బస్సుల్లో జర్నీ చేయలేమని, అందుకే ఏసీ, లగ్జరీ బస్సులే కావాలని సమాధానాలు చెప్తున్నారు.  

ఫీడ్ ​బ్యాక్​ ఆధారంగా...

ఐటీకారిడార్​తో పాటు, లాంగ్​రూట్లలో డిమాండ్​కు అనుగుణంగా బస్సులను నడిపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రత్యేకించి ఐటీ ఉద్యోగులు కోరుకుంటున్నట్టుగానే ఏసీ, లగ్జరీ బస్సులను నడిపేందుకు ప్లాన్​చేస్తున్నారు. గ్రేటర్​లో 2800 బస్సులు నడుపుతున్న ఆర్టీసీ ఇందులో 500 వరకు ఎలక్ట్రిక్​ బస్సులు, మరో 90 ఏసీ బస్సులు నడుపుతోంది. ఐటీకారిడార్లను కవర్​ చేసే సికింద్రాబాద్​–పటాన్​చెరు రూట్​లో 14 ఏసీ బస్సులు నడుస్తుండగా, కోఠి–కొండాపూర్​ రూట్​లో ఆరు, కోఠి–లింగంపల్లి రూట్​లో 10, బాచుపల్లి–జేఎన్​టీయూ రూట్​లో ఏడు,రాయదుర్గం మెట్రో స్టేషన్ల మధ్య 14 బస్సులను నడుపుతోంది. వీటితో పాటు మరో 50 పుష్పక్​ బస్సులను రన్​ చేస్తోంది. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఈ రూట్లలో ప్రయాణిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని ఏసీ బస్సులు ప్రవేశపెట్టడానికి అధికారులు ప్లాన్​చేస్తున్నారు. వచ్చే వేసవి నాటికి మరిన్ని ఏసీ బస్సులు తీసుకువస్తామని అధికారులు తెలిపారు.  

లగ్జరీగా ఉంటేనే బాగుంటుంది

ఉద్యోగం చేసి అలసిపోయి ఇంటికి వెళ్లేప్పుడు కాస్త రిలాక్సింగ్​గా ప్రయాణించాలనిపిస్తుంది. అందుకే నేను ఏసీ బస్సులనే ప్రిఫర్​ చేస్తా. సిటీ ట్రాఫిక్​లో గంటల తరబడి ప్రయాణించాల్సి వచ్చినప్పుడు ఏసీ బస్సులకన్నా బెటర్ ఆప్షన్​ లేదు.  – కిరణ్, ఐటీ ఎంప్లాయ్​

ఏసీ బస్సులో డిస్ట్రబెన్స్​ఉండదు

నేను రాత్రి డ్యూటీలతో అలసిపోతుంటా. ఇంటికి వెళ్లేప్పుడు ఏసీ బస్సుల్లో వెళ్తే డిస్ట్రబెన్స్ ఉండదు. అలసట అనిపించదు. ఏసీ, లగ్జరీ బస్సుల్లో కొద్దిసేపు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అందుకే నా ప్రయారిటీ ఎప్పుడూ ఏసీ బస్సే.  – సుభాష్, ఐటీ ఉద్యోగి