మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
  • 80 కేసుల్లో ప్రభాకర్ నిందితుడు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 23 కేసులు

గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్  గచ్చిబౌలిలోని ప్రిజం పబ్  వద్ద  పోలీసులపై కాల్పులు జరిపిన మోస్ట్ వాంటెడ్  క్రిమినల్  బత్తుల ప్రభాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు.  చిత్తూరు జిల్లా సోమలాద్రి మండలం ఇరికిపెంట గ్రామానికి చెందిన బత్తుల ప్రభాకర్  విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి 2013 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. పోలీసులు తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు రాజు, రాహుల్  రెడ్డి, బయ్యపు రెడ్డి, సర్వేశ్వర్  రెడ్డి, బిట్టు, హర్షవర్దన్ రెడ్డి అనే పేర్లతో చెలామణి అవుతున్నాడు. రాత్రిపూట తాళంవేసి ఉన్న ఇండ్లను టార్గెట్  చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నాడు. 

ఏడుసార్లు  జైలుకు వెళ్లి వచ్చాడు. 2022 మార్చి 23న విశాఖపట్నంలోని అరిలోవ పోలీసులు అరెస్టు చేసి విశాఖపట్నం సెంట్రల్  జైలుకు తరలిస్తుండగా తప్పించుకున్నాడు. అక్కడి నుంచి తెలంగాణకు మకాం మార్చి.. హైదరాబాద్ లోని గచ్చిబౌలి నార్సింగి ఏరియాల్లో నివాసం ఉంటున్నాడు. ఇక్కడ కూడా దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. సిటీ శివారులో ఉన్న ఇంజినీరింగ్  కాలేజీల్లో చోరీలు చేశాడు. దొంగలించిన సొమ్ముతో విలాసవంతమైన జీవితం గడిపాడు. 

ఇలా చిక్కాడు... 

ఇటీవల మొయినాబాద్ లో రెండు ఇంజినీరింగ్  కాలేజీల్లో ప్రభాకర్  దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ కేసులో పోలీసులకు ప్రభాకర్  వివరాలు లభించాయి. అప్పటి నుంచి రాజేంద్రనగర్, మాదాపూర్  సీసీఎస్  పోలీసులు అతని ఆచూకీ కోసం వెతుకుతున్నారు. అతను రెగ్యులర్ గా గచ్చిబౌలి లోని పలు పబ్ లకు వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నెల 1న గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ కు ప్రభాకర్  వచ్చినట్లు సమాచారం అందుకున్న మాదాపూర్  సీసీఎస్  హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి, కానిస్టేబుళ్లు ప్రదీప్, వీరస్వామి పబ్  వద్దకు చేరుకున్నారు. 

పోలీసులను చూసిన ప్రభాకర్  తన వద్ద ఉన్న గన్ తో కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ వెంకట్ రెడ్డి ఎడమ పాదంలో నుంచి దూసుకెళ్లింది. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు పబ్ కి చెందిన బౌన్సర్ల సహాయంతో ప్రభాకర్ ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి పిస్టల్స్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.  అతనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 23 కేసులు ఉన్నాయి. అలాగే తెలంగాణ, ఏపీ, కర్నాటక, మహారాష్ట్రలో మొత్తం 80 కేసులు ఉన్నాయి. 

తెలుగు రాష్ట్రాల్లోని 23 కేసుల్లో రూ. 2.5 కోట్లు కొల్లగొట్టాడు. ఆ డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపాడు. స్వగ్రామంలో తొమ్మిదో తరగతి వరకు చదువుకున్న ప్రభాకర్..  వైజాగ్ లో దొంగతనం చేసే సమయంలో పరిచయం అయిన ఓ యువతిని పెండ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాకర్  ఒక్కడే ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, ప్రభాకర్  జరిపిన కాల్పుల్లో గాయపడిన హెడ్ కానిస్టేబుల్  వెంకట్ రెడ్డి సేఫ్​ గా ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.