కన్న బిడ్డలను చంపుకుంటే.. సంతోషమొస్తుందా?

కన్న బిడ్డలను చంపుకుంటే.. సంతోషమొస్తుందా?

పిల్లలపై తల్లిదండ్రులకు ఎనలేని ప్రేమ ఉంటుంది.  ఎన్ని సమస్యలున్నా.. ఎంత ఒత్తిడి ఉన్నా.. రోజంతా కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన పేరెంట్స్​ కు పిల్లల చిరునవ్వు చూస్తే చాలు.. అప్పటివరకు ఉన్న బాధలన్నీ పటాపంచలవుతాయి. ముఖ్యంగా తల్లి ప్రేమ వెలకట్టలేనిది. తండ్రి.. పిల్లల పోషణ, వారి భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడుతూ.. వారికి కావాల్సినవి సమకూరుస్తూ.. తనలోని ప్రేమను పంచిపెడతాడు. కానీ, తల్లి మాత్రం.. పిల్లలు పుట్టినప్పటి నుంచి వారి బాగోగులపైనే తన ధ్యాసంతా ఉంటుంది. వారికి చిన్నసమస్య వచ్చినా అల్లాడిపోతుంది. కానీ, ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న కొన్ని ఘటనలు  దిగ్ర్భాంతికి గురి చేస్తున్నాయి. కొందరు మహిళల ఆకృత్యాలు ‘అమ్మ ప్రేమ’ను అవహేళన చేస్తున్నాయి. తల్లి ప్రేమకు కళంకం తెచ్చిపెడుతున్నాయి. 

గోరుముద్దలు తినిపించిన తన చేతులతోనే ముక్కుపచ్చలారని చిన్నారులకు  అన్నంలో విషం కలిపి,  క్రూరంగా హింసించి, కిరాతకంగా అంతమొందిస్తున్నారు. అంగవైకల్యంతో పుట్టినపిల్లలను కూడా అక్కున చేర్చుకొని.. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ అనారోగ్యంతో కదలలేని, నడవలేని, మాట్లాడలేని స్థితిలో ఉంటే చూసి తట్టుకోలేక బిడ్డతో సహా ప్రాణత్యాగానికి పాల్పడుతున్న తల్లులు కొందరు ఉంటే.. వివాహేతర సంబంధం పెట్టుకొని.. ప్రియుడే ప్రపంచమనుకొని.. అతనితోనే సంతోషం ఉంటుందనే భ్రమలో.. ఆ సంతోషానికి  తన కడుపున పుట్టినవారే  అడ్డుగా ఉన్నారనే అనాలోచిత నిర్ణయంతో.. కన్నబిడ్డల  ప్రాణాలు తీస్తున్నారు మరికొందరు. తమ తాత్కాలిక ఆనందం కోసం కన్నబిడ్డలను చంపుకుంటున్నారు.

తప్పుచేసి తప్పించుకోగలరా?

ప్రస్తుత సమాజంలో పెరిగిన టెక్నాలజీతో నేరం చేసిన వారు తప్పించుకోవడం అసంభవం.  ఓ వ్యక్తిని ఊర్లో చంపి.. ఊరవతల పాతిపెట్టినా.. సులువుగా నిందితులను పట్టుకుంటున్న రోజులివి. అలాంటి టెక్నాలజీ ప్రస్తుతం పోలీసుల వద్ద ఉంది.  పకడ్బందీ ప్లాన్​తో, ఎంత తెలివిగా నేరం చేసినా.. ఎక్కడో ఓ చోట ఆధారాలు వదిలేస్తూ ఇట్టే దొరికిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరి ప్రాణం తీసి.. తాను ఇష్టపడిన వ్యక్తితో వెళ్లిపోవచ్చు.. అతనితో జీవితాంతం సంతోషంగా ఉండొచ్చనే భావన నేరం చేస్తున్న వారిలో.. చేయిస్తున్న వారిలో ఉండడం వారి అవివేకానికి నిదర్శనం.  ఒక హత్య జరిగితే చట్టం చేతులు కట్టుకొని ఉంటుందా? ప్రియుడి మోజులో పడి అప్పటికే మానసికంగా బలహీనపడిపోయి అనాలోచితంగా హత్య చేసి బుకాయిస్తే  చెల్లుతుందా?   కేసులు, అరెస్టులు, జైలు జీవితం గడిపిన తర్వాత.. నీ కన్నబిడ్డలనే హత్య చేయమని సలహా ఇచ్చిన ప్రియుడు వాటన్నింటి తర్వాత ఆ  మహిళను పెండ్లి చేసుకొని కొత్త జీవితం ప్రసాదిస్తాడా? ఈ క్రమంలో  కన్న పిల్లలను చంపుకుంటే.. ఆమె కోరుకున్న సంతోషం దక్కుతుందా? తప్పుచేసే ముందు ఒకసారి ఆలోచించాలి. 

ఇష్టంలేని పెండ్లితో  కష్టమే 

నేటి సమాజంలో యువత తమకు నచ్చిన రీతిలో బతకాలని కోరుకుంటున్నారు. దీంతో పిల్లల ఇష్టాలు తెలుసుకోకుండా తల్లిదండ్రులు పెండ్లి చేస్తే అవి నిలబడడం లేదు. ఇటీవలి కాలంలో విడాకులు అనేవి సర్వసాధారణమవుతున్నాయి. తల్లిదండ్రులు ఇష్టంలేని పెండ్లి చేశారని కొందరు.. పెండ్లి తర్వాత భార్య/భర్తలో మార్పులు  రావడంతో మరికొందరు.. పెండ్లికి ముందు వేరొకరితో   ప్రేమాయణం నడిపిన ఇంకొందరు.. ఇద్దరి మధ్య వయసు గ్యాప్​ ఎక్కువగా ఉండడం ఇలా.. ఏదో ఓ కారణంతో విడాకులు తీసుకుంటున్నారు. అయితే.. ఈ అంశంలో ఎవరిని బాధ్యులను చేయాలన్నదే ప్రశ్న. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు కష్టపడకుండా ఉండాలని.. ఆమె ఇష్టాయిష్టాలను తెలుసుకోకుండా.. ఆమె మనసులో ఇంకెవరైనా ఉన్నారా? అని అడగకుండా డబ్బు, ఆస్తి, ఉద్యోగం చూసి పెండ్లి చేసే తల్లిదండ్రులదా? తనకు ఇష్టం లేకున్నా తల్లిదండ్రుల బలవంతంతోనో వారిని ఇబ్బంది పెట్టొద్దనే భావనతో పెండ్లి చేసుకుంటున్న యువతదా? ఈ అంశంలో 
స్పష్టత లేకుంటే ఇలాంటి అనర్థాలు జరగడం పరిపాటే అవుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా తల్లిదండ్రులు కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెండ్లయ్యాక వారు ఇబ్బందులు పడేకంటే.. పెండ్లికి ముందే ఈ అంశాలను పరిశీలిస్తే ఫ్యూచర్​లో ఎలాంటి ఇబ్బందులు రావు. 

ప్రతి మహిళ నేరం వెనుక ఓ పురుషుడు

వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న నేరాలలో చాలా వరకు మహిళలే   ప్రథమ ముద్దాయిలుగా నిలుస్తున్నారు. కానీ, ఆ నేరం వెనుక ఓ పురుషుడి పాత్ర కూడా కీలకంగా ఉంటున్న విషయం మరుగున పడిపోతున్నది. ప్రియుడి మోజులో పడి ప్రియుడితో బతకాలని,   ఇలా ఎంతసేపు పరాయి వ్యక్తితో సంబంధం కోసమే మహిళలు నేరాలు చేస్తున్నారన్నది ఇక్కడ స్పష్టమవుతున్నది. ఇలాంటి సున్నితమైన విషయాలలో మహిళ అయినా, పురుషుడు అయినా విచక్షణ కోల్పోయి, క్షణకాల సుఖం కోసం తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.  కాబట్టి వారి స్వార్థం కోసం మానవత్వాన్ని మరిచి అమాయకుల ప్రాణాలు తీయాలనే విపరీత ఆలోచనలను మానుకోవాలి. 

అపహాస్యమవుతున్న వివాహ బంధం

ప్రపంచంలోనే భారతీయ వివాహ బంధానికి ఎంతో గొప్ప పేరు ఉంది. ఇతర దేశాలతో పోల్చుకుంటే.. పెండ్లి తంతు కూడా ఎంతో ఆర్భాటంగా ఉంటుంది. ఒక్కసారి వివాహ బంధంతో ఒక్కటైన జంట విడిపోవడం చాలా అరుదు. ఎంతో పెద్ద సమస్య వస్తే తప్ప విడాకులు తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. భర్తను భార్య గౌరవిస్తూ.. భార్యను భర్త గౌరవిస్తూ.. సంసార జీవితంలో ఎన్ని ఒడుదొడుకులు  ఎదురైనా తట్టుకొని.. పిల్లలను ప్రయోజకులను చేసి.. వారికి పెండ్లి చేసేవరకు అలుపెరగకుండా 
కష్ట పడుతూనే ఉండడం భారతీయ సంస్కృతిలో ఒక  ప్రధాన భాగం.  కానీ,  మారుతున్న కాలానికి అనుగుణంగా ఎంతో కీర్తిగడించిన భారతీయ వైవాహిక బంధం కూడా మసకబారుతోంది.  నేటితరం యువత దాంపత్య బంధానికి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.  తమకు నచ్చిన రీతిలో బతకాలని కోరుకుంటున్నారు. నచ్చిన రీతిన బతకడం తప్పుకాదు, కానీ అది అక్రమ సంబంధాలు, హత్యల దాకా దారితీయడమే  సమస్య. ఈ సమస్యపై  సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. దానిలోనే మనం పరిష్కారమూ వెదకాలి.


- గొడిషాల 
రమేశ్​ ​బాబు,
సీనియర్​ జర్నలిస్ట్​