టీచర్ల ప్రమోషన్లలో అక్రమాలకు డీఈవోనే బాధ్యుడు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో టీచర్ల ప్రమోషన్లలో జరిగిన అక్రమాలకు డీఈవోనే బాధ్యుడని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆసంపల్లి రమేశ్, ప్రధాన కార్యదర్శి మోతె జయకృష్ణ ఆరోపించారు. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, ఇంగ్లిష్, పీఎస్​హెచ్ఎంలలో ఒక్కో టీచర్​కు రెండు పోస్టింగులు, చనిపోయిన వారికి ప్రమోషన్లు కల్పించడం విచిత్రమని అన్నారు. 

దీనివల్ల ప్రమోషన్ వరుసక్రమంలో ఉన్న టీచర్లు నష్టపోవాల్సి వస్తోందన్నారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన లిస్ట్​ను జిల్లా అధికారులు సరిచేసి సరైన లిస్ట్​ను పంపాల్సిన బాధ్యత డీఈవోదేనని పేర్కొన్నారు. ప్రమోషన్లలో సీనియారిటీని డీఎస్సీ ర్యాంక్ ప్రకారం తీసుకోవాల్సి ఉండగా జాయినింగ్ డేట్ ఆధారంగా చేసుకొని డీఈవో తీవ్ర నష్టం చేశారన్నారు. డీఈవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ కుమార్ దీపక్​కు బుధవారం మెమోరాండం అందజేశారు.