- పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్లో విషాదం
పెద్దపల్లి/ రామగిరి, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాంనగర్ లో సోమవారం రాత్రి కరెంట్ షార్ట్ సర్క్యూట్‌తో తల్లీకూతుళ్లు కలవల పోచమ్మ (65), గడ్డం కొమురమ్మ( 45) సజీవదహనమయ్యారు. వివరాలిలా ఉన్నాయి.. కొమురమ్మ కూలీ పనులకు వెళ్తుండగా, ఆమె భర్త కనుకయ్య వైన్ షాప్ పర్మిట్ రూమ్‌లో పని చేస్తున్నాడు. సోమవారం కొమురమ్మ తల్లి పోచమ్మ బిడ్డను చూడడానికి ముల్కలపల్లి నుంచి వచ్చింది. తల్లీబిడ్డలు ఇంటి తలుపులు మూసుకొని మంచంలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు.
తలుపుకు అడ్డంగా కూలర్ ఉంది. ఈ క్రమంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో కరెంట్ షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లంతా మంటలు వ్యాపించాయి. బయటకు వెళ్లకుండా మంటలు అంటుకోవడంతో ఇద్దరు సజీవదహనం అయ్యారు. మంటల్లో పడి ఒక కుక్క, ఒక కోడి కూడా కాలిపోయాయి. రాత్రి పర్మిట్ రూమ్‌లో పని ముగించుకొని ఇంటికి చేరుకున్న కనుకయ్య ప్రమాదం విషయాన్ని గుర్తించాడు. మంగళవారం ఏసీపీ రమేశ్, సీఐ రాజు, ఎస్ఐ చంద్రకుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి విచారించారు. ప్రమాదంలోనే చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.