హైవేపై లారీ బీభత్సం..

హైవేపై లారీ బీభత్సం..
  • మద్యం మత్తులో రెండు బైకులు, ఆటోను ఢీకొట్టిన లారీ డ్రైవర్
  • బైకుపై వెళ్తున్న తల్లి, బిడ్డ మృతి.. తండ్రి, మరో బిడ్డకు తీవ్ర గాయాలు  
  • రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ వద్ద ప్రమాదం

షాద్ నగర్, వెలుగు: నేషనల్ హైవేపై మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ముందుగా వెళ్తున్న రెండు బైకులను, ఓ ఆటోను లారీతో ఢీకొట్టడంతో ఒక మహిళ, ఆమె బిడ్డ మృతి చెందారు. మృతురాలి భర్త, మరో బిడ్డ తీవ్రంగా గాయపడ్డారు. బోనాల పండుగ కోసం చుట్టాల ఇంటికి వెళ్తున్న తల్లీకూతురు ఇలా లారీ ఢీకొని చనిపోయిన ఘటన రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. 

షాద్​నగర్ ​పట్టణం పటేల్​గూడకు చెందిన కన్నెకోట సాయికృష్ణ, కావ్య(25) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరు నలుగురు కలిసి ఆదివారం ఉదయం బైక్​పై హైదరాబాద్ ఉప్పుగూడలోని బంధువుల ఇంట్లో శ్రావణ మాస బోనాల పండుగకు బయలుదేరారు. తిమ్మాపూర్​వద్ద నేషనల్​హైవేపై వీరిని పశ్చిమ బెంగాల్​లోని హుగ్లీ నుంచి వస్తున్న లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కావ్య, చిన్న కూతురు అనన్య(1) అక్కడికక్కడే చనిపోయారు. సాయికృష్ణతోపాటు పెద్ద కూతురుకు, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో లారీ డ్రైవర్​షేక్ మొహమ్మద్ మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతో లారీని కంట్రోల్ చేయలేక సాయికృష్ణ బైకుతోపాటు మరో రెండు వాహనాలను ఢీకొట్టించాడని, ఈ ఘటనలో రెండు బైక్​లు, ఆటో ధ్వంసం అయ్యాయని,  లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. సాయికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.