మిర్యాలగూడలో అనుమానాస్పదంగా తల్లీకూతురు మృతి

మిర్యాలగూడలో అనుమానాస్పదంగా తల్లీకూతురు మృతి

మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో శనివారం అనుమానాస్పదంగా తల్లీకూతురు చనిపోయారు. స్థానికులు, వన్ టౌన్  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  పల్నాడు జిల్లా మాచర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన సీతారాంరెడ్డి, రాజేశ్వరి దంపతులకు మధుశ్రీ, వేద సాయిశ్రీ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సీతారాంరెడ్డి ఆగ్రో కెమికల్  జిల్లా సేల్స్  మేనేజర్ గా పని చేస్తున్నాడు. మూడు రోజుల కింద డ్యూటీలో భాగంగా సీతారాంరెడ్డి హైదరాబాద్ కు వెళ్లాడు.

శనివారం ఇంట్లో రాజేశ్వరి(34) ఫ్యాన్ కు ఉరి వేసుకొని చనిపోగా, చిన్న కూతురు వేద సాయిశ్రీ(13) గొంతుపై తీవ్రగాయాలతో చనిపోయి ఉంది. మధుశ్రీ, వేద సాయిశ్రీకి నిద్రమాత్రలు వేసి అనంతరం తల్లి రాజేశ్వరి ఈ దారుణానికి పాల్పడిందా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

కాగా, ఇంటికి తిరిగి వచ్చిన సీతారాంరెడ్డి తలుపులు తెరవాలని చాలా సేపు డోర్ కొట్టిన తరువాత నిద్ర మత్తు నుంచి తేరుకున్న పెద్ద కూతురు మధుశ్రీ లేచి చూసే సరికి తల్లి, చెల్లి చనిపోయి ఉన్నారు. డెడ్​బాడీలను చూసి ఏడుస్తూ అస్వస్థత గురికాగా, స్థానికులు ఆమెను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.