భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం పైకి ఎక్కి ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నం చేశారు. అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామానికి చెందిన తల్లి చీదర సాయమ్మ, కూతురు వెంకటమ్మ కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు. తమ పేరు మీద ఉన్న ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని తన కొడుకు వెంకటేశ్వర్లు అనుభవిస్తున్నాడని.. అడిగితే కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని అధికారులకు వెల్లడించారు. తమ గోడు ఎన్ని సార్లు చెప్పిన అధికారులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు.
ఈ క్రమంలో మనస్తాపానికి గురైన తల్లి కూతుళ్లు జిల్లా కలెక్టరేట్ బిల్డింగ్ పైకి ఎక్కి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న డిఆర్ఓ అశోక్ చక్రవర్తి.. జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు బాధితులకు నచ్చచెప్పి క్రిందకు దింపారు. తమకు న్యాయం చేయాలని తల్లీ కుతుళ్లు కలెక్టర్ ను కోరారు. దీంతో స్పందించిన కలెక్టర్ సమస్యను పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.