తిరుపతి: లాక్ డౌన్ కారణంగా కర్ణాటక రాష్ట్రంలో చిక్కుకున్నఇద్దరు తల్లీకూతుళ్లు V6 న్యూస్ ఛానెల్ చొరవతో క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. రెండు నెలలుగా బెంగుళూరులో తీవ్ర ఇబ్బందులు పడిన ప్రకాశం జిల్లా వాసులు చివరికి స్వగ్రామానికి చేరుకున్నారు.
ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని స్వర్ణ గ్రామంలో వీధి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వెంగాయమ్మను మూడు నెలల క్రితం గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో చికిత్స నిమిత్తం ఆమె కర్ణాటకలోని మంగుళూరు ఆసుపత్రికి వెళ్లింది. చికిత్స అనంతరం తన తల్లిని తీసుకువచ్చేందుకు ఆమె కూతురు అరుణ కుమారి కూడా మంగళూరు వెళ్లింది. మార్చి 22 న డిశ్చార్జ్ కావాల్సి ఉండగా ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో తల్లీకూతుళ్లు ఇద్దరూ అక్కడే ఇరుక్కుపోయారు. దీంతో అక్కడి అధికారులు వారిద్దర్నీ క్వారెంటైన్ కు తరలించారు.
కొన్ని రోజుల క్రితం అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలను సడలించడంతో .. వారు సొంతూరు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తమ దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయి తినడానికి తిండి లేక, ఎలా వెళ్ళాలో తెలియక బెంగుళూరు బస్టాండ్ దగ్గర 5 రోజులుగా అవస్థ పడ్డారు..
తనకు భర్త లేడని, తన ఇద్దరు ఆడపిల్లలు ఊరి దగ్గర ఒంటరిగా ఇబ్బంది పడుతున్నారని, అరుణకుమారి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో బెంగళూరు నుండి కర్ణాటక మీడియా సహకారంతో కారులో కాణిపాకం చేరుకున్నారు. కాణిపాకం నుండి మరో కారులో సొంత గ్రామం స్వర్ణ కు చేరుకున్నారు. ఈ విషయం పరుచూరు వై.సి.పి ఇంచార్జ్ రావి రామనాధం బాబు దృష్టికి తీసుకువెళ్ళడంతో వెంటనే స్పందించి వాహన ఖర్చులు భరిస్తానని బాధితులకు అండగా నిలిచారు. తమను ఇంటికి చేర్చిన V6 మీడియా ప్రతినిధులకు అరుణ కుమారి, ఆమె తల్లి వెంగాయమ్మ V6 ఛానెల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.