తల్లిని, నలుగురు చెల్లెళ్లను మణికట్టు కోసి చంపిండు.. యూపీలో తండ్రి సాయంతో కొడుకు కిరాతకం

తల్లిని, నలుగురు చెల్లెళ్లను  మణికట్టు కోసి చంపిండు.. యూపీలో తండ్రి సాయంతో కొడుకు కిరాతకం

లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోరం జరిగింది. ఓ యువకుడు తన తల్లిని, నలుగురు చెల్లెళ్లను దారుణంగా చంపేశాడు. ఆపై 'నా తల్లి, చెల్లెళ్లను చంపేసి వారి గౌరవాన్ని కాపాడాను' అంటూ ఓ వీడియో రిలీజ్ చేయడం సంచలనంగా మారింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అర్షద్(24) యూపీలోని బుదౌన్‌‌‌‌ నివాసి. ఇటీవల తన కుటుంబ సభ్యులతో సహా లక్నోకి వచ్చాడు. నకా ఏరియాలోని హోటల్ శరణ్‌‌‌‌జిత్‌‌‌‌లో రూమ్ తీసుకున్నాడు. అర్షద్ బుధవారం తెల్లవారుజామున తన తండ్రితో కలిసి తల్లి ఆష్మా సహా, తన నలుగురు చెల్లెళ్లు -రహ్మీన్ (18), అల్సియా (19), అక్సా(16), ఆలియా (9)లను చేతి మణికట్టుపై కత్తితో కోసి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తన కుటుంబ సభ్యులను హత్య చేయడానికి గల కారణాలను వివరిస్తూ ఓ సెల్పీ వీడియో తీశాడు.

ల్యాండ్ మాఫియా వేధింపులే కారణం

వీడియోలో అర్షద్ మాట్లాడుతూ.. తన తల్లిని, నలుగురు చెల్లెళ్లను చంపినట్లు చెప్పాడు. "మా ఇంటిని ల్యాండ్ మాఫియా ఆక్రమించింది.  మా బాధను ఎవరూ పట్టించుకోలేదు. మేమంతా గత 15 రోజులుగా  ఫుట్ పాత్​పై చలిలో నిద్రపోతున్నాము. ల్యాండ్ మాఫియా నన్ను, నా  తండ్రిని తప్పుడు కేసుల్లో ఇరికించి, నా చెల్లెళ్లను అమ్మాలని ప్లాన్ చేసింది. అది మాకు ఇష్టం లేదు. అందుకే  తల్లిని, నలుగురు చెల్లెళ్లను చంపేశాను. వారి గౌరవాన్ని కాపాడాను. ఈ హత్యలకు రాను, అఫ్తాబ్, అలీమ్ ఖాన్, సలీం, ఆరిఫ్, అహ్మద్, అజార్ లే కారణం. నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను" అని అర్షద్ వివరించాడు. 

తాము బంగ్లాదేశీయులమని కొందరు తప్పుడు ప్రచారంచేశారని వెల్లడించాడు. తమ కుటుంబం ప్రశాంతంగా జీవించేందుకు మతం మారాలని నిర్ణయించుకున్నట్లు అర్షద్ తన వీడియోలో చెప్పాడు. తమకు సాయం కోసం వేడుకున్నా ఎవరూ సాయం చేయలేదని, భారతదేశంలో ఏ కుటుంబానికీ ఇలాంటి పరిస్థితి రావద్దన్నాడు. తనకు న్యాయం చేయాలని పీఎం మోదీని, సీఎం యోగిని కోరాడు. తమను వేధించిన వారికి రాజకీయ నేతలు, పోలీసులతో సంబంధం ఉందని ఆరోపించాడు. తన భూమిని ఆలయానికి, వస్తువులను అనాథాశ్రమానికి విరాళంగా ఇవ్వాలని కోరాడు. అర్షద్​ను, అతని తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.