తల్లీకొడుకే హంతకులు.. నిజామాబాద్లో వీడిన బాలుడి మర్డర్​ మిస్టరీ

తల్లీకొడుకే హంతకులు.. నిజామాబాద్లో వీడిన బాలుడి మర్డర్​ మిస్టరీ

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ లో నెలల చిన్నారి మర్డర్​మిస్టరీ వీడింది. నిందితులైన తల్లి, కొడుకును అరెస్ట్ చేశారు. సోమవారం నిజామాబాద్ సీపీ సాయి చైతన్య మీడియాకు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని నాందేడ్​ జిల్లా బిలోలికి చెందిన కమలాబాయి తన కూతుళ్లు శివాని(12), రోజా(10), కొడుకు కైలాశ్(14 నెలలు)తో కలిసి నిజామాబాద్ లో భిక్షాటన చేస్తుంది.  ఆమె భర్త గంగాధర్​సొంతూరిలోనే ఉన్నాడు. అదే జిల్లా ధర్మాబాద్​కు చెందిన మాలాబాయి బోస్లే, ఆమె కొడుకు గోపాల్​బోస్లే కూడా నిజామాబాద్ లో  భిక్షాటన చేస్తుంటారు. వీరిద్దరికి నేరచరిత్ర ఉంది. భిక్షాటనలో వీరికి కమలాబాయితో కొన్నేండ్లుగా పరిచయం ఉంది.

కాగా.. తన భర్త విఠల్​ఏడాది కింద అనుమానాస్పదంగా చనిపోగా.. అందుకు కమలాబాయినే కారకురాలని మాలాబాయి బోస్లే అనుమానిస్తూ కక్ష పెంచుకుంది. అంతేకాకుండా తమ కంటే కమలాబాయి చిన్నపిల్లలతో కలిసి ఎక్కువగా సంపాదిస్తుందని అసూయ పెంచుకున్నారు. దీంతో  కమలాబాయి కొడుకును చంపేందుకు ప్లాన్ చేశారు. గత నెల 27న కమలాబాయి రాత్రి తన ఇద్దరు కూతుళ్లను కొత్త బస్టాండ్​లో వదిలి, కొడుకు కైలాస్ ను తీసుకుని వెళ్లి రైల్వేస్టేషన్​లో నిద్రపోయింది. మాలాబాయి బోస్లే , బోస్లే గోపాల్​అర్ధరాత్రి రైల్వేస్టేషన్కు వెళ్లి బాలుడిని కిడ్నాప్ చేశారు. సిటీలోని ఉమెన్స్​కాలేజీ సమీపంలోని తీసుకెళ్లి చిన్నారి తలపై కొట్టి హత్య చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా తల్లి కొడుకును నిందితులుగా గుర్తించి అరెస్టు చేసి రిమాండ్​కు తరలించామని సీపీ సాయి చైతన్య తెలిపారు.