తల్లీకొడుకులపై కత్తులతో దాడి

తల్లీకొడుకులపై కత్తులతో దాడి
  • పరిస్థితి విషమం.. గాంధీలో ట్రీట్మెంట్
  • దుండగుల కోసం చిలకలగూడ పోలీసుల గాలింపు

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్​మెట్టుగూడలో ఒంటరిగా ఉన్న తల్లీకొడుకులపై ఆరుగురు దుండగులు కత్తులతో హత్యాయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నది. చిలకలగూడ పోలీసుల వివరాల ప్రకారం.. మెట్టుగూడ నల్లపోచమ్మ ఆలయం ప్రాంతానికి చెందిన రేణుక, శేఖర్‌‌‌‌లు దంపతులు. వీరికి యశ్వంత్, యశ్పాల్, వినయ్‌‌‌‌ ముగ్గురు కొడుకులు ఉండగా, శేఖర్‌‌‌‌ మూడేండ్ల కింద మృతిచెందాడు. 

దీంతో మతిస్థిమితం కోల్పోయి మంచానికే పరిమితమైన తన అత్త, ముగ్గురు కొడుకులతో రేణుక నివాసం ఉంటోంది. పెద్దకొడుకు యశ్వంత్‌‌‌‌ మౌలాలీలోని రైల్వే కాంట్రాక్టర్‌‌‌‌ వద్ద జాబ్​చేసి మూడు నెలల క్రితం మానేశాడు. యశ్పాల్, వినయ్‌‌‌‌ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. గురువారం ఉదయం వీరిద్దరూ డ్యూటీకి వెళ్లగా, యశ్వంత్, రేణుక ఇంట్లో ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కొంతమంది దుండగులు ఇంట్లోకి చొరబడి రేణుక, యశ్వంత్‌‌‌‌ పై కత్తులతో దాడి చేశారు. తీవ్రగాయాలైన ఇరువులు కేకలు వేస్తూ కింద పడిపోయారు. 

అనంతరం ఇంటి బయట తలుపులకు గొల్లెం పెట్టి దుండగులు పరారయ్యారు. ప్రాణాపాయస్థితిలో బాధితులు గట్టిగా అరవడంతో ఇంటిపక్కనున్న వాళ్లు గమనించి రక్తపుమడుగుల్లో వారిని 108 అంబులెన్స్‌‌‌‌లో గాంధీ దవాఖానకు తరలించారు. రేణుక కడుపులో రెండు కత్తిపోట్లు, యశ్వంత్‌‌‌‌ కడుపులో మూడు కత్తిపోట్లు ఉన్నాయి. ప్రస్తుతం వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఇంట్లో తాము లేని సమయం చూసి ప్లాన్​ప్రకారమే దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారని మూడో కొడుకు వినయ్‌‌‌‌ మీడియాకు తెలిపారు. 

తమ ఫ్యామిలీకి ఎవరితోనూ గొడవలు లేవన్నారు. అసలు దాడి ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదన్నారు. ఆరుగురు దుండగులు ఈ సంఘటనలో పాల్గొన్నారని,  నలుగురు ఇంట్లోకి వెళ్లి దాడి చేయగా, ఇద్దరు బయట ఉన్నారని వివరించాడు. చిలకలగూ పోలీసులు  క్లూస్‌‌‌‌ టీం, డాగ్‌‌‌‌ స్వాడ్‌‌‌‌తో ఆధారాలు సేకరించారు. 

 సీసీ టీవీ ఫుటేజీలో ఉన్న నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్శించి విడిచిపెట్టారు. అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో మిస్టరీని ఛేదిస్తామని ఈస్ట్‌‌‌‌జోన్‌‌‌‌ అడిషనల్‌‌‌‌ డీసీపీ నర్సయ్య, చిలకలగూడ ఏసీపీ జైపాల్‌‌‌‌రెడ్డి, సీఐ అనుదీప్​తెలిపారు.