దొంగతనం నిందమోపారన్న మనస్తాపంతో తల్లీకొడుకు సూసైడ్‌‌

దొంగతనం నిందమోపారన్న మనస్తాపంతో  తల్లీకొడుకు సూసైడ్‌‌

జోగిపేట, వెలుగు : దొంగతనం నింద మోపారన్న మనస్తాపంతో తల్లీకొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఆంధోల్‌‌ మండలంలోని చింతకుంటలో బుధవారం వెలుగుచూసింది. జోగిపేట సీఐ అనిల్‌‌కుమార్‌‌ తెలిపిన వివరాల ప్రకారం.. చింతకుంట గ్రామానికి చెందిన చాంద్‌‌పాషా ఇంట్లో సోమవారం ఓ ఫంక్షన్‌‌ జరిగింది. ఈ కార్యక్రమానికి అతడి బంధువులు టాటా ఏస్‌‌ వాహనంలో వచ్చి దానిని ఓ ప్లేస్‌‌లో పార్క్‌‌ చేశారు. సోమవారం అర్ధరాత్రి ఆ వాహనం చోరీకి గురైంది. టాటా ఏస్‌‌ను అదే గ్రామానికి చెందిన వడ్ల శ్యామ్‌‌ (21)చోరీ చేశాడని గ్రామస్తులు అనుమానించారు. దీంతో మంగళవారం పంచాయితీ నిర్వహించి రూ. 5 లక్షలు చెల్లించాలని నిర్ణయించారు.

అయితే చోరీకి గురైన టాటా ఏస్‌‌ కౌడిపల్లి మండలం బుజరంపేటలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో శ్యామ్‌‌ తన తల్లి బాలమణి (40)తో కలిసి బైక్‌‌పై బుజరంపేటకు బయలుదేరాడు. మార్గమధ్యలో చింతకుంట బ్రిడ్జి వద్దకు రాగానే అక్కడ బైక్‌‌ ఆపేసి నీటిలోకి దూకాడు. ఆ వెంటనే అతడి తల్లి బాలమణి సైతం నీటిలో దూకింది. బ్రిడ్జిపై బైక్‌‌ అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే బ్రిడ్జి జోగిపేట, కౌడిపల్లి శివార్లలో ఉండడంతో పోలీసులు తమ పరిధి కాదంటే తమ పరిధి కాదంటూ చాలాసేపటి వరకు పట్టించుకోలేదు. 

చివరకు జోగిపేట పోలీసులు నీటిలో గాలించగా శ్యామ్‌‌, బాలమణి డెడ్‌‌బాడీలు దొరికాయి. కాగా చోరీ చేశారంటూ నింద మోపడం వల్లే తన కొడుకు శ్యామ్‌‌, భార్య బాలమణి ఆత్మహత్య చేసుకున్నారని యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు చింతకుంట గ్రామానికి చెందిన మొగులు, చాంద్‌‌పాషా, అస్లాం, మహబూబ్‌‌, శ్రీను, ఆంజనేయులు, శ్రీశైలంపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు