కొడుకు మృతిని తట్టుకోలేక ఆగిన తల్లి గుండె

కొడుకు మృతిని తట్టుకోలేక ఆగిన తల్లి గుండె

మెదక్, వెలుగు :  కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నకొడుకు మృతి చెందడం చూసి తట్టుకోలేని తల్లి గుండె ఆగింది. గంటల వ్యవధిలోనే కొడుకు, తల్లి ఇద్దరూ మృతి చెందిన విషాదకర సంఘటన మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం కూచన్ పల్లిలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన వీరప్పగారి నర్సాగౌడ్ ఉపాధి కోసం ఆటో నడుపుకుంటూ.. వచ్చే కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. భార్య, కూతురు, కొడుకు, వృద్ధురాలైన తల్లికి అతనే ఆధారం. 

కాగా రోజు మాదిరిగానే శుక్రవారం కూడా ఆటో నడిపి రాత్రి ఇంటికి చేరి భోజనం చేసి నిద్రపోయాడు. తెల్లవారు జామున మూడు గంటల సమయంలో నర్సాగౌడ్(35) చాతిలో నొప్పి వస్తుందని చెప్పాగా, ఇరుగు పొరుగు వారి సహకారంతో అతన్ని మెదక్​ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే డాక్టర్​పరీక్షించి హార్ట్​ఎటాక్ రావడం వల్ల అతను అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. అస్వస్థతకు గురైన నర్సాగౌడ్ ను ఆసుపత్రికి తీసుకెళ్లి తెల్లారి చాలా సేపైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని తల్లి లక్ష్మి(53) ఆందోళనకు గురైంది.

 ఆమెకు అనారోగ్య సమస్య ఉండటంతో కొడుకు చనిపోయిన విషయం చెప్పలేదు. అయితే కొడుకుకు ఏమైందో, ఎట్లున్నాడో అని ఆవేదనకు గురై ఇంట్లో ఉండలేక స్థానికుల సహకారంతో మెదక్​ ప్రభుత్వాసుపత్రికి చేరుకుంది. అక్కడ కొడుకు విగత జీవిగా పడి ఉండటం చూసి తట్టుకోలేక లక్ష్మి కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. నర్సాగౌడ్​ తండ్రి నారాగౌడ్​ కూడా నాలుగేళ్ల కిందటే అనారోగ్యంతో చనిపోయాడు. ప్రస్తుతం వారింట్లో నర్సాగౌడ్ భార్య, పదేళ్లలోపు ఇద్దరు పిల్లలు మాత్రమే మిగిలారు. తల్లీ కొడుకులిద్దరి అంత్యక్రియలు ఒకే సారి నిర్వహించడం చూసి కూచన్​పల్లి గ్రామస్థులు కంటతడి పెట్టారు. బాధిత కుటుంబానికి మెదక్​ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్​రావు​రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు.