- తల్లిని, కొడుకును రాడ్తో కొట్టి చంపిన నిందితుడు
- పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకబాదిన జనాలు
- పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే హత్యలు జరిగాయని బంధువుల ఆరోపణ
- మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఘటన
గూడూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా గూడూరులో మంగళవారం పట్టపగలే ఇద్దరిని రాడ్తో కొట్టి చంపాడు. గూడూరు బస్టాండ్సమీపంలోని నేషనల్హైవేపై జనాలంతా చూస్తుండగానే ఓ మహిళను, ఆమె కొడుకును హత్య చేశాడు. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని బొల్లెపెల్లికి చెందిన ఆటో డ్రైవర్ శివరాత్రి కుమార్..తన కుటుంబానికి అదే గ్రామానికి చెందిన ఆలకుంట కొమురయ్య, సమ్మక్క (55), కుటుంబసభ్యులు మంత్రాలు చేశారని అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీ కూడా నిర్వహించగా సర్ది చెప్పి పంపించారు. వారం క్రితం గ్రామంలో మళ్లీ గొడవ జరగడంతో గూడూరు పీఎస్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. రెండు రోజుల క్రితం కొమురయ్య కొడుకు సమ్మయ్య(40) బిడ్డ ఎంగేజ్ మెంట్ ఉండడంతో పోలీసులు కేసును సోమవారం తర్వాత చూస్తామని చెప్పారు. దీంతో మంగళవారం ఉదయం 11గంటలకు కొమురయ్య, సమ్మక్క, సమ్మయ్య, శివరాత్రి కుమార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వస్తూ బస్టాండ్ సమీపంలో గొడవ పడ్డారు.
కోపంతో రగలిపోయిన కుమార్ తన ఆటోలోని ఐరన్ రాడ్ తో సమ్మక్క తలపై కొట్టాడు. అడ్డుకోబోయిన సమ్మయ్య, కొమురయ్యలనూ రాడ్తో కొట్టాడు. దీంతో సమ్మక్క, సమ్మయ్య అక్కడే చనిపోగా కొమురయ్య కాలు, చేయి విరిగింది. తర్వాత నిందితుడు పారిపోతుండగా అక్కడే ఉన్న ప్రజలు పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకబాదారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. సీఐ ఫణిధర్, ఎస్సై రాణాప్రతాప్, పరిమళ, కొత్తగూడ ఎస్సై గణేశ్, గంగారం ఎస్సై దిలీప్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. శవాలను ట్రాక్టర్లో మార్చురీకి తరలిస్తుండగా మృతుల బంధువులు అడ్డుకున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ హత్యలు జరిగాయని ఆరోపించారు. దీంతో కొద్దిసేపు పోలీసులకు, మృతుల బంధువుల మధ్య వాగ్వాదం జరిగింది. సీఐ ఫణిధర్మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో అడ్డుతప్పుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.