
పద్మారావునగర్, వెలుగు: బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన తల్లీకొడుకు వేములవాడలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి వివరాల ప్రకారం.. ఇక్రిసాట్ కాలనీలో నివాసం ఉంటున్న రాఘవేందర్–అర్చన దంపతులకు కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో రాఘవేంద్రకు ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో అవి మరింత పెరిగాయి.
అర్చన సనత్ నగర్ లోని తన తండ్రికి చెందిన యూనిఫామ్ బిజినెస్ లో అడ్మిన్ గా పని చేస్తోంది. ఈ క్రమంలో భర్తతో గొడవపడి, ఏడేళ్ల కుమారుడు దేవాంశ్ ను తీసుకొని సనత్ నగర్ లోని కార్యాలయానికి వెళ్తున్నట్లు చెప్పింది. తర్వాత ఇద్దరూ కనిపించకుండా పోయారు. రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించి, తల్లీకొడుకు వేములవాడలో ఉన్నట్లు గుర్తించారు. వారిని వేములవాడ నుంచి తీసుకొస్తున్నట్లు సీఐ లక్ష్మీనారాయణ రెడ్డి
తెలిపారు.