
- బట్టలు ఉతికేందుకు చెరువులో దిగిన తల్లి
- స్నానం చేస్తుండగా మునిగిపోయిన చిన్నారులు
- పిల్లలను కాపాడే ప్రయత్నంలో తల్లి కూడా మృతి
- కామారెడ్డి జిల్లాలో ఘటన
ఎల్లారెడ్డి, వెలుగు: చెరువులో మునిగి తల్లితో పాటు ముగ్గురు చిన్నారులు చనిపోయారు. బట్టలు ఉతికేందుకు తల్లి చెరువులో దిగగా.. చిన్నారులు స్నానం కోసం వెళ్లారు. ప్రమాదవశాత్తు చిన్నారులు మునిగిపోతుండగా.. వారిని కాపాడే ప్రయత్నంలో తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపురం గ్రామంలో చోటు చేసుకున్నది.
బొమ్మర్థి లింగయ్యకు కొన్నేండ్ల కింద కళ్యాణికి చెందిన ఓ మహిళతో పెండ్లి అయింది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు మైథిలి, అక్షర, కొడుకు వినయ్ ఉన్నారు. అనారోగ్యంతో భార్య మూడేండ్ల కింద చనిపోయింది. దీంతో లింగయ్య రెండేండ్ల కింద మౌనికను పెండ్లి చేసుకున్నాడు. ముగ్గురు పిల్లల ఆలనపాలనా మౌనిక చూసుకుంటున్నది. శనివారం మధ్యాహ్నం మౌనిక తమకున్న పొలానికి నీరు పారించేందుకు వెళ్లింది. ఈమె వెంట ముగ్గురు పిల్లలు కూడా వెళ్లారు. పొలానికి నీరు పారించిన తర్వాత పక్కనే ఉన్న చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లింది. పిల్లలు చెరువులో స్నానం చేసేందుకు దిగారు. పెద్ద పెద్ద రాళ్లు ఉండటం, వీటి పక్కనే గుంతలు ఉన్నాయి.
స్నానం చేసేందుకు దిగిన పిల్లలు.. గుంతలో పడిపోయారు. వీరిని కాపాడేందుకు మౌనిక వెళ్లింది. ప్రమాదవశాత్తు నలుగురూ నీటిలో మునిగి చనిపోయారు. హమాలీ పని చేయడానికి ఎల్లారెడ్డికి వెళ్లిన లింగయ్య సాయంత్రానికి ఇంటికి వచ్చాడు. ఇంట్లో భార్య, పిల్లలు లేకపోవడంతో చుట్టుపక్కల ఇండ్లకు వెళ్లి ఉంటారని భావించి ఆరా తీశాడు. పొలం దగ్గర వెళ్లగా అక్కడా కనిపించలేదు. పక్కనే ఉన్న చెరువు వద్దకు వెళ్లగా అక్కడ పిల్లల బట్టలు, చెప్పులు కనిపించాయి. చెరువులో మునిగిపోయి ఉంటారని భావించి కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు.
చెరువులో రాత్రి వరకు గాలించగా ఇద్దరు పిల్లల డెడ్‌బాడీలు దొరికాయి. ఆదివారం పొద్దున మరో ఇద్దరి మృతదేహాలు దొరికాయి. మైథిలి (10), అక్షర ( 9), కొడుకు వినయ్ (7)తో పాటు మౌనిక డెడ్‌బాడీలను ఎల్లారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలాన్ని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు, సీఐ రవీందర్ నాయక్, ఎస్సై మహేశ్ పరిశీలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.