- బట్టలు ఉతికేందుకు వెళ్లగా నీటిలో పడిన కొడుకు
- రక్షించేందుకు వెళ్లి మునిగిన తల్లి, ఇద్దరు పిల్లలు
- మరో చిన్నారిని కాపాడిన స్థానిక రైతులు
- పాలమూరు జిల్లా పోమాల్ గ్రామంలో ఘటన
నవాబుపేట, వెలుగు : మహబూబ్నగర్జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఉతికేందుకు వెళ్లి తల్లి, ఇద్దరు పిల్లలు మృతిచెందారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నవాబుపేట మండలం పోమాల్గ్రామానికి చెందిన మల్లేశ్, సరోజ(24) దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
సరోజ బట్టలు ఉతికేందుకు శనివారం గ్రామ శివారులోని పెద్ద చెరువు వద్దకు తన నలుగురు పిల్లలతో కలిసి వెళ్లింది. ఆమె బట్టలు ఉతుకుతుండగా చిన్న కొడుకు అక్షయ్ (3) ఆడుకుంటూ వెళ్లి చెరువులో పడిపోయాడు. బయటకు తీసేందుకు తల్లి ప్రయత్నిస్తుండగా కూతుళ్లు తేజ(9), దివ్య(8) కూడా చెరువులోకి దిగారు.
ఒకరినొకరు పట్టుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగిపోయారు. చెరువు కట్టమీద ఉన్న పెద్ద కొడుకు శివ(7) కేకలు వేయడంతో పొలాల్లోని రైతులు వచ్చారు. తేజ మునుగుతూ కనిపించడంతో రక్షించారు. అప్పటికే తల్లితో పాటు అక్షయ్, దివ్య పూర్తిగా మునిగిపోయారు. చెరువులోకి దిగి డెడ్‌బాడీలను బయటకు తీశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు.
చేపలు పట్టేందుకు వెళ్లి మరో ఇద్దరు..
కొండపాక(కుక్కునూరు పల్లి): చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మంగోల్ లో జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. రాయపోల్ మండలం ఏల్కల్ కు చెందిన గడ్డం కిష్టయ్య (55), గొడుగు శివకుమార్( 33), గజ్వేల్ పరిధి కుకునూరు పల్లిలో ఉంటున్నారు. వీరు శుక్రవారం సొంతూరు వెళ్లారు. అదేరోజు చేపలు పట్టేందుకు వెళ్తున్నామని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు.
శనివారం మంగోల్ శివారులోని మల్లన్న సాగర్ కెనాల్ లో ఇద్దరి డెడ్ బాడీలు పైకి తేలి కనిపించగా.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు వెళ్లి గ్రామస్తుల సాయంతో తీసి పోస్టుమార్టం కోసం గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబాల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.