అమీన్‏పూర్‎లో విషాదం.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

అమీన్‏పూర్‎లో విషాదం.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి ఆపై తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ముగ్గురు పిల్లలు మృతి చెందగా.. తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. పోలీసుల వివరాల ప్రకారం.. వాటర్ ట్యాంకర్ డ్రైవర్‎గా పనిచేస్తోన్న చెన్నయ్య (40), లావణ్య (38) దంపతులు రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి కృష్ణ (12) మధుప్రియ (10) గౌతమ్ (8) ముగ్గురు పిల్లలు ఉన్నారు. 

ఈ క్రమంలో గురువారం (మార్చి 27) రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు. పప్పు, పెరుగుతో డిన్నర్ చేశారు. లావణ్య, ముగ్గురు పిల్లలు పెరుగుతో తినగా.. చెన్నయ్య మాత్రం పప్పు ఒకటే తినేసి డ్యూటీకి వెళ్లాడు. రాత్రి 11 గంటలకు డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య, పిల్లలు అపస్మారక స్థితిలో ఉండటంతో ఆందోళనకు గురైన చెన్నయ్య చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి  తరలించాడు. అప్పటికే పిల్లలు ముగ్గురు చనిపోయినట్లు వైద్యలు నిర్ధారించారు. 

లావణ్య ప్రాణపాయ స్థితిలో ఉందని వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న అమీన్ పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఘటన స్థలాన్ని పరిశీలించి మరణాలకు గల కారణాలపై వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. పెరుగులో ఏదైనా విషం కలిపి పిల్లలను చంపి.. ఆ తర్వాత లావణ్య ఆత్మహత్యయత్నం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలతోనే ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.