
అనంతపురం: జిల్లాలోని కదిరి మండలంలో దారుణం చోటుచేసుకుంది. కన్న బిడ్డ తనను ప్రశ్నించిందనే కోపంతో ఆ పాప కాళ్లూ, చేతులపై అట్లకాడతో వాతలు పెట్టింది ఓ తల్లి. ఈ విషయం తెలిసిన స్థానికులు ఛైల్డ్‌లైన్ ప్రతినిధులకు తెలియజేయడంతో అసలు విషయం బయటపడింది.
కందికుంట కాలనిలో నివాసమున్న ఓ మహిళ భర్తతో విడిపోయింది. భర్తతో విడిపోయే నాటికి ఆమెకు మూడేళ్ల కుమార్తె ఉండగా మళ్లీ ఐదు నెలల గర్భిణి. ఆ తర్వాత కొంతకాలానికి రెండో పెళ్లి చేసుకుంది. పది రోజుల కిందట కుమార్తె… ‘మా నాన్నెవరు? నాకు చెల్లెలో తమ్ముడో ఉండేవారట… ఎక్కడ?’ అని తల్లిని అడిగినట్లు సమాచారం. అందుకు ఆగ్రహించిన తల్లి వయసుకు మించి మాట్లాడుతున్నావు… పెద్దల విషయాలు నీకెందుకంటూ విచక్షణ కోల్పోయి, అట్లకాడతో చిన్నారి ఒంటిపై వాతలు పెట్టింది.
ఈ విషయం తెలసుకున్న ప్రజాసేవా సమాజ్, ఛైల్డ్‌లైన్ 1098 ప్రతినిధులు.. ఈ సమాచారాన్ని ఐసీడీఎస్ సిబ్బంది, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు, అధికారులు గాయపడిన బాలికకు చికిత్స అందించారు. తల్లిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి రెండో కాన్పులో పుట్టిన శిశువు గురించి ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.