- అదనపు కట్నం వేధింపులే కారణం
- ముషీరాబాద్‌లో ఘటన
బషీర్ బాగ్, వెలుగు: అదనపు కట్నం కోసం భర్త, అత్త వేధిస్తుండటంతో ఓ మహిళ తన ఏడు నెలల చిన్నారితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో జరిగింది. రాంనగర్ బాకారంలో ఉండే విద్యాసాగర్ కు అంబర్ పేట్ పటేల్ నగర్ కు చెందిన వసంత కుమారితో పదేండ్ల కింద పెండ్లి అయ్యింది. భర్త విద్యాసాగర్ ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. పెండ్లి అయినప్పటి నుంచి వసంత కుమారిని విద్యాసాగర్ అదనపు కట్నం కోసం వేధిస్తుండేవాడు. దీంతో తరుచూ వారి మధ్య గొడవలు జరిగేవి. ఇటీవల వసంత కుమారికి ఆడపిల్ల పుట్టడంతో ఆ వేధింపులు ఎక్కువయ్యాయి. 12న విద్యాసాగర్ తన తల్లిని సంగారెడ్డి తీసుకెళ్లి వదిలి.. తిరిగి 13వ తేదీ అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నాడు.
తలుపులు వేసి ఉండటం, ఎంత పిలిచినా స్పందించకపోవడంతో చుట్టుపక్క వారి సాయంతో డోర్ విరగొట్టి లోపకెళ్లి చూడగా వసంత కుమారి (34), విద్యా ధరణి (7 నెలల) చనిపోయి కనిపించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి డెడ్‌బాడీలను పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తండ్రి నూకరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విద్యాసాగర్, అతని తల్లిపై 306, 498A సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.