కాజీపేట, వెలుగు: నాలుగేండ్ల బిడ్డను గొంతునులిమి చంపిన ఓ తల్లి, తర్వాత తానూ సూసైడ్ చేసుకుంది. మడికొండ సీఐ వేణు కథనం ప్రకారం..జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం చాగల్ గ్రామానికి చెందిన అనిత(26)కు, హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామానికి చెందిన ఈరబోయిన రాకేశ్‌తో ఐదేండ్ల కింద పెండ్లయ్యింది. వీరికి పాప శివశాన్విక(4) ఉంది. రాకేశ్ తన తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ముళ్లు, భార్య, బిడ్డతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు. పెండ్లి టైంలో అనితకు కట్నం కింద ఆమె తల్లిదండ్రులు చాగల్ లో 20 గుంటల వ్యవసాయ భూమిని రాసిచ్చారు.
ఆ భూమికి మంచి రేటు పలుకుతుండడంతో అమ్మితే కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతుందని రాకేశ్, అత్తింటివారు భావించాడు. తమ్ముళ్ల పెళ్లిళ్లు కూడా చేయొచ్చని రాకేశ్ అనుకున్నాడు. ఈ విషయంలో అనితకు అత్తింటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. దీనిపై గతంలోనూ పంచాయితీలు జరగ్గా భూమి అమ్మేందుకు అనిత ఒప్పుకోలేదు. అత్తింటివారు పట్టుబట్టడంతో మనస్తాపం చెందిన అనిత బుధవారం ఇంట్లో బిడ్డ గొంతు నులిమి చంపి, తానూ ఉరేసుకుంది.