
- వృద్ధురాలైన తల్లి పోలీసులకు కంప్లయింట్
ఉప్పల్, వెలుగు : కొడుకు ఆస్తిని లాక్కొని ఇంటి నుంచి బయటకు గెంటేశాడని ఓ వృద్ధురాలైన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతకుముందు ఆర్డీఓ ఆర్డరు కాపీ పట్టుకుని న్యాయం చేయాలని ఇంటి ముందు ధర్నా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పల్ పరిధి చిలుకనగర్ లో ఉండే వంగరి రమాదేవికి ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లు. కాగా..ఆమె భర్త సుదర్శన్ 1997లో మృతి చెందాడు. కొడుకు శివకుమార్ వద్ద ఆమె ఉంటుండగా.. కొన్నేండ్ల కిందట ఆస్తిని రాయించుకోవడమే కాకుండా.. ఆ భవనంలో డాక్స్ గ్లోబల్ హై స్కూల్ ను పెట్టాడు.
అనంతరం వృద్ధురాలైన తల్లిని ఇంట్లోంచి కొడుకు గెంటేశాడు. తన సోదరిలను సైతం పుట్టింటికి రాకుండా చేశాడు. దిక్కుతోచని స్థితిలో రమాదేవి ఓల్డేజ్ హోమ్‌కు చేరింది. ఆరోగ్యం సహకరించకపోగా కూతుళ్లు తీసుకెళ్లి ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ చేయించారు. బుధవారం రమాదేవి ఇంటికి తాళం వేసి నిరసనకు దిగింది. అనంతరం ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లిని సరిగా చూడని కొడుకు శివశంకర్ హై స్కూల్ నడిపిస్తూ విద్యార్థులకు ఎలా పాఠాలు చెప్తారని సోదరిణులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సంఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి చట్టప్రకారం శివశంకర్ పై చర్యలు తీసుకుంటామని ఆమెకు సూచించారు.