కొడుకులు బుక్కెడు బువ్వ పెడ్తలేరు .. పోలీస్​స్టేషన్​లో తల్లి ఫిర్యాదు

బెల్లంపల్లి రూరల్, వెలుగు: ఉన్న భూమినంతా లాక్కొని తల్లికి తిండి పెట్టకుండా కొడుకులు కూలిపోయే గుడిసెలో వదిలేశారు. వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కొడుకులు.. తమ వల్ల కాదు పొమ్మని పట్టించుకోవడం లేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే... మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లి గ్రామానికి చెందిన రాంటెంకి చిన్నక్క మంగళవారం తన ముగ్గురు కొడుకులు తనను పట్టించుకోవడం లేదని , బుక్కెడు అన్నం కూడా పెట్టడం లేదని పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. తన భర్త రాజయ్య ఐదేండ్ల కింద చనిపోయాడని, అప్పటి నుంచి కొడుకులు తనను పోషించడం లేదని చీటికి, మాటికి కొడుతూ ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని వేధిస్తున్నారని వాపోయింది. నెన్నెల ఎస్ఐ ప్రసాద్​ ఎదుట కన్నీటిపర్యంతమైంది. తనకు న్యాయం చేసి దారి చూపించాలని వేడుకుంది. స్పందించిన ఎస్ఐ ముగ్గురు కొడుకులతో ఫోన్​లో మాట్లాడి బుధవారం పోలీస్​స్టేషన్​కు రావాలని ఆదేశించారు. కొడుకులకు కౌన్సిలింగ్​ ఇచ్చి వృద్దురాలికి న్యాయం జరిగేలా చూస్తానని ఎస్ఐ​చెప్పారు.

తండ్రిని పోషించడం లేదని.. 

గొల్లపల్లి: తనను పోషించడం లేదని ఓ తండ్రి ఫిర్యాదుతో కొడుకుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సతీశ్‌ తెలిపారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనుగుమట్ల గ్రామానికి చెందిన గొల్లపల్లి చిన్న కోటగౌడ్‌కు కొడుకు శ్రీనివాస్​గౌడ్​ఉన్నాడు. భార్య గతంలోనే చనిపోగా, ఒంటరిగా ఉంటున్న తనను కొడుకు పోషించడం లేదని ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.