- హయత్‌నగర్‌లోని ఎస్వీ కన్వెక్షన్ సెంటర్‌లో పోలింగ్
- ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు ఎన్నికలు, తర్వాత కౌంటింగ్
- కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య హోరాహోరీ పోరు
- రైతులకు ఇన్సెంటివ్, పెండింగ్ బిల్లులు ఇప్పిస్తామని మంత్రి కోమటిరెడ్డి హామీ
నల్గొండ, వెలుగు : నల్గొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహాకార సంఘం (మదర్ డెయిరీ) ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. హయత్‌నగర్‌లోని ఎస్వీ కన్వెక్షన్ హాల్‌లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 297 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
నల్గొండలో నాలుగు, రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానాలకు, నలుగురు కాంగ్రెస్ క్యాండిడేట్లు పోటీ పడుతుండగా, నల్గొండ జిల్లాలో నాలుగు డైరెక్టర్ స్థానాలకు 8 మంది బరిలో ఉన్నారు. ఇందులో కాంగ్రెస్ తరపున నలుగురు, బీఆర్‌ఎస్ నుంచి నలుగురు ఉన్నారు.
మూడు రోజులుగా కాంగ్రెస్ క్యాంప్
మదర్ డెయిరీ పాలకవర్గాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల ఇన్‌చార్జిగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య వ్యవహరిస్తున్నారు. బొంగళూరు గేట్ వద్ద గల ప్రమద ఫంక్షన్ హాల్‌లో మూడు రోజులుగా కాంగ్రెస్ క్యాంప్ నడుస్తోంది. క్యాంప్‌లో ఉన్న ఓటర్లతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, మందుల సామేలు, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి గురువారం మీటింగ్ పెట్టారు. ఈ సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్యఅథిగా హాజరుకాగా, మాజీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి అధ్యక్షతన వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఆరు స్థానాల్లో కాంగ్రెస్ క్యాండిడేట్లను గెలిపిస్తే సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి పెండింగ్‌లో ఉన్న పాల బిల్లులు చెల్లిస్తామని, రైతులకు ఇన్సెంటివ్స్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే బీఆర్‌ఎస్ తరఫున డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి ఎన్నికల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆలేరు నుంచే 8 మంది అభ్యర్థులు బరిలో ఉండడం, 130 మంది ఓటర్లు ఆలేరు నియోజకవర్గానికి చెందిన వారే ఉండడంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. దీంతో క్రాస్ ఓటింగ్ జరుగుతుందన్న అనుమానం ఇరువర్గాలను వెంటాడుతోంది.
ఉత్కంఠభరింతగా ఎన్నికల పోరు
డెయిరీలో మొత్తం 15 మంది డైరెక్టర్లకుగాను ప్రస్తుతం 9 మంది పదవిలో ఉన్నారు. ఇందులో ఆరుగురు బీఆర్‌ఎస్ వర్గం కాగా, ముగ్గురు కాంగ్రెస్ ప్యానెల్‌కు చెందిన వారు. ఈ ఎన్నికల్లో ఆరు డైరెక్టర్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటేనే డెయిరీ పాలకవర్గాలు చేతిలోకి వస్తాయి. అదే బీఆర్‌ఎస్‌కు ఇద్దరు డైరెక్టర్లు గెలిచినా ఇప్పుడున్న వారితో కలిపి ఆ పార్టీదే పైచేయి అవుతుంది. దీంతో డెయిరీని దక్కించుకునేందుకు పోటాపోటీగా ఖర్చు పెడుతున్నారు. కాంగ్రెస్ వర్గం ఓటర్లకు రూ.25 వేలు ఇస్తుండగా, బీఆర్‌ఎస్ రూ. 20 వేల వరకు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.