
- మదర్ డెయిరీ 3 నెలలుగా బిల్లులు ఇవ్వట్లేదని ఆగ్రహం
ఇబ్రహీంపట్నం, వెలుగు : మదర్ డైయిరీ(నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం) మూడు నెలలుగా పాల బిల్లులు చెల్లించడం లేదని యాచారం మండలం కుర్మిద్ద గ్రామానికి చెందిన పాడి రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. క్యాన్లలోని పాలను పారబోసి నిరసన తెలిపారు. నెలలో రెండు సార్లు బిల్లులు చెల్లించాల్సి ఉండగా, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల బిల్లులు రాలేదన్నారు. పైసలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తే సమాధానం ఉండట్లేదన్నారు.
విసుగు చెంది పాలను నేలపాలు చేసినట్లు వాపోయారు. నిరసనలో కుర్మిద్ద గ్రామ మదర్ డెయిరీ సంఘం అధ్యక్షుడు మహేందర్రెడ్డి, పాడి రైతులు అంజయ్య, శ్రీనివాస్, జనార్ధన్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.