పదేండ్లలో రూ.60 కోట్ల అప్పుల ఊబిలోకి మదర్​డెయిరీ

పదేండ్లలో రూ.60 కోట్ల అప్పుల ఊబిలోకి మదర్​డెయిరీ
  • స్థిరాస్తులు అమ్మితేనే సంస్థను కాపాడగలం  
  • నార్ముల్ మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి 

ఎల్బీనగర్​, వెలుగు: నార్ముల్ మదర్ డెయిరీ ఆస్తులను విక్రయించడం ద్వారానే సంస్థను కాపాడొచ్చని చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి అన్నారు. డెయిరీకి ఉన్న ఆస్తులను అమ్మేందుకు నిర్ణయం తీసుకుందని దాన్ని ఆమోదించాలని సభ్యులను కోరారు. హయత్ నగర్‌‌‌‌లోని మదర్ డెయిరీ ఆఫీసు ఆవరణలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ..  మదర్ డెయిరీ రూ. 60 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. 2014 వరకు లాభాల్లో ఉండే డెయిరీ మార్కెట్ లో పోటీ, కరోనా పరిస్థితులు, యాజమాన్య నిర్ణయాలతో అప్పుల్లో కూరుకుపోయిందన్నారు.  నల్లగొండ జిల్లా చిట్యాలలోని 29.36  ఎకరాల భూమితో పాటు నకిలేకల్, చండూరులోని స్థలాలను విక్రయించి అప్పులు తీర్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే మెజార్టీ సభ్యుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాతే సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.   

మాజీ  చైర్మన్లు,మాజీ డైరెక్టర్లు, సొసైటీల అధ్యక్షులు మద్దతు తెలపాలని కోరారు.   స్థిరాస్తి విక్రయాలకు బదులుగా దిద్దుబాటు చర్యలు తీసుకుని సంస్థను గాడిలో  పెట్టాలని మాజీ చైర్మన్ గుత్తా జితేందర్​రెడ్డి సూచించారు.  మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి మాట్లాడుతూ..  సంస్థ లాభనష్టాలకు పాలకవర్గమే బాధ్యత వహించాలన్నారు. సొసైటీ చైర్మన్లు భాస్కర్ రెడ్డి, భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ... ఆస్తుల విక్రయాలలో పారదర్శకత పాటించాలన్నారు.  మాజీ చైర్మన్లు శ్రీకర్​ రెడ్డి, గంగుల కృష్ణారెడ్డి, సంస్థ ఎండీ బీ కృష్ణ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.