రామాంతపూర్ లో దారుణం.. ఆస్తికోసం కన్నతల్లినే హత్య చేసిన కసాయి కొడుకు

ఈ సమాజం ఎటు పోతోంది.. మానవ సంబంధాలు, బందుత్వాలు మరిచి.. ఆస్తికోసం ఎంత దారుణానికైనా ఒడిగడుతున్నారు. కొందరైతే డబ్బు కోసం.. తల్లితండ్రు, అన్న చెల్లె్లలు అనే బంధాన్ని మరిచి.. సొంత వారినే చంపుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రస్తుత సమాజంలో పరిపాటిగా మారింది. ఆస్తి కోసం.. ఎంత దారుణానికి పాల్పడుతున్నారంటే.. నవమాసాలు మోసి కని పెంచిన కన్న తల్లి ప్రాణాలనే తీస్తున్నారు. తాజాగా ఇలాంటి  దారుణ  ఘటనే  హైదరాబాద్ రామంతపూర్ లో చోటుచేసుకుంది. ఆస్తికోసం కన్న తల్లినే  కడతేర్చాడు ఓ కసాయి కొడుకు.  

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  రామంతపూర్ లో అనిల్ అనే వ్యక్తి... తన భార్య తరుమల, తల్లి సుగుణమ్మతో కలిసి నివాసం ఉంటున్నాడు. వారు ఉంటున్న ఇల్లును అనిల్ అమ్మాలనుకున్నాడు.. అయితే, ఆ ఇల్లు తన తల్లి పేరుపై ఉంది. దీంతో  ఇల్లు అమ్మాడానికి తల్లి సుగుణమ్మ  ఒప్పుకోలేదు.  దీంతో తల్లిని  అంతమొందించి ఇంటిని సొంతం చేసుకుని అమ్మాలని ప్లాన్ చేశాడు. 

ఈ క్రమంలో తన భార్య, ఆమె స్నేహితుడితో కలిసి అనిల్.. కన్న తల్లి అని చూడకుండా దారుణంగా సుగుణమ్మను చంపేశాడు. అంత్యక్రియల సమయంలో బందువులకు అనుమానం రావడంతో ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.సుగుణమ్మ మృతిపై కేసు నమోదుచేసి పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది.  కన్న కొడుకే ఆస్తి కోసం.. తన భార్య, మరో వ్యక్తితో కలిసి సుగుణమ్మను హత్య చేసినట్లు తేలింది. దీంతో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.