- సోషల్ మీడియాలో కామెంట్లు తట్టుకోలేక చెన్నై టెకీ ఆత్మహత్య
- గత నెలలో బాల్కనీ నుంచి చిన్నారిని కాపాడిన స్థానికులు
- వీడియో వైరల్.. అనంతరం తల్లిపై ట్రోలింగ్ స్టార్ట్ చేసిన నెటిజన్లు
- మనస్తాపంతో సొంతూరుకెళ్లి ఆత్మహత్య చేసుకున్న పసిబిడ్డ తల్లి
చెన్నై: నెటిజన్ల ట్రోలింగ్‌కు ఓ తల్లి బలైంది. సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ విషాదం చోటుచేసుకుంది. ఇటీవల చెన్నైలోని ఓ అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి కిందపడుతున్న చంటిబిడ్డను.. స్థానికులు కాపాడిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటన అనంతరం ఆ బిడ్డ తల్లిని తప్పుపడుతూ సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు. వాళ్ల కామెంట్లతో మనస్తాపం చెందిన ఆ తల్లి ఆదివారం బలవన్మరణానికి పాల్పడింది.
ఇదీ జరిగింది..
కోయంబత్తూరులోని కరమడైకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రమ్య(29) భర్తతో కలిసి చెన్నైలోని ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. ఏప్రిల్ 28న రమ్య తన 8 నెలల బిడ్డను ఎత్తుకుని బాల్కనీలో అన్నం తినిపిస్తుండగా అకస్మాత్తుగా ఆ పసికందు తల్లి చేతిలో నుంచి జారి ఫస్ట్ ఫ్లోర్‌లోని సన్ షేడ్ రేకులపై పడిపోయింది. గమనించిన పొరుగువారు ఆ పాపను కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. చిన్నారిని కాపాడినవాళ్లను ఇంటర్వ్యూలు చేస్తూ రోజంతా ఈ ఘటనను తమిళ టీవీ చానళ్లు ప్రసారం చేశాయి. పాపను కాపాడినోళ్లను మెచ్చుకుంటూనే, తల్లి నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
జాగ్రత్తగా చూసుకోలేని తల్లిదండ్రులకు పిల్లలెందుకని ట్రోల్ చేశారు. దీంతో డిప్రెషన్‌కు గురైన రమ్య కోయంబత్తూర్‌లోని తన తల్లిగారి ఇంటికి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురై ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటికి తిరిగివచ్చిన తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
సోషల్ మీడియాలో ట్రోల్స్, కామెంట్లతోనే రమ్య మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు మీడియాకు వెల్లడించారు. తాజా ఘటనపై స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘మీ ట్రోల్స్ వల్లే చిన్నారి తల్లి చనిపోయింది. ఇప్పుడు మీ కండ్లు సల్లవడ్డయా?’ అంటూ సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది.