డబ్బుల కోసం..కన్నవాళ్లనే కడతేర్చిన్రు

పైసలకున్న విలువ మనుషులకు ఉండడం లేదు. డబ్బు కోసం అవసరమైతే కన్నవాళ్లను, కట్టుకున్నవాళ్లను, కడుపున పుట్టిన పిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలే జయశంకర్ ​భూపాలపల్లి, మహబూబాబాద్ ​జిల్లాల్లో జరిగాయి. వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన కొడుకులు..వారు సంపాదించే పైసల కోసం అంతం చేశారు. 

రేగొండ, వెలుగు : జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరిలో వడ్లు అమ్మిన పైసలు ఇవ్వలేదని ఓ కొడుకు కన్నతల్లిని గొడ్డలితో నరికి చంపాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. తిరుమలగిరికి చెందిన కంచరకుంట్ల హైమ(65)కు ఇద్దరు కొడుకులు. పదేండ్ల కింద హైమ భర్త చనిపోవడంతో వ్యవసాయం చేసుకుంటూ, కూలీ పనులకు వెళ్తూ కొడుకులను సాదింది. చిన్న కొడుకు శ్రీనివాస్​రెడ్డి తమిళనాడులో ఉంటుండుగా, పెద్ద కొడుకు రాజిరెడ్డి తల్లితోనే ఉంటున్నాడు. తల్లి దగ్గర డబ్బులు కనిపించినప్పుడల్లా రాజిరెడ్డి గొడవ పడి మరీ తీసుకునేవాడు. కొద్ది రోజుల కింద హైమ వడ్లు అమ్మగా రూ.లక్షా 50 వేలు వచ్చాయి. ఆ డబ్బులు కూడా కావాలని రాజిరెడ్డి పోరు పెడుతున్నాడు. ఇస్తే మొత్తం ఖర్చు చేస్తాడని భయపడిన హైమ ఇవ్వనని తెగేసి చెప్పింది. అయినా అలాగే వేధిస్తుండడంతో గురువారం రాత్రి తన రూమ్​లోకి వెళ్లి తలుపు పెట్టుకుని పడుకుంది. రాజిరెడ్డి చాలాసేపు తలుపు బాదినా తీయలేదు. బయటకు రాకపోతే ఇంట్లో ఉన్న పత్తిని కాలబెడతానని బెదిరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తలుపు తీసింది.

 అప్పటికే ఆవేశంతో చేతిలో గొడ్డలి, రొకలి బండ పట్టుకుని ఉన్న రాజిరెడ్డి ఆమె రాగానే గొడ్డలితో వేటు వేశాడు. కిందపడినా వదలకుండా రొకలిబండతో తలపై బాదాడు. దీంతో హైమ అక్కడికక్కడే చనిపోయింది. ఆమె అరుపులు విన్న పక్కింటి జ్యోతి పరిగెత్తుకు వచ్చింది. రాజిరెడ్డిని ఆపేందుకు ప్రయత్నించగా  తలపై గొడ్డలితో కొట్టడంతో కిందపడిపోయింది. తర్వాత రాజిరెడ్డి పారిపోయాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న జ్యోతిని కుటుంబసభ్యులు హైదరాబాద్​తరలించారు. ప్రస్తుతం జ్యోతి పరిస్థితి విషమంగా ఉంది. పరారైన రాజిరెడ్డి గోరికొత్తపల్లి మండలం చిన్నకోడెపాకలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తెల్లవారుజామున అనుమానాస్పదంగా తచ్చాడుతుండడంతో  దొంగగా భావించిన అక్కడి గ్రామస్తులు పట్టుకుని తాళ్లతో కట్టేశారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. హైమ ఎప్పుడూ పిల్లల కోసమే కష్టపడేదని, సంపాదన అంతా రాజిరెడ్డికే ఇచ్చేదని, అయినా ఆమెను చంపాడని గ్రామస్తులు చెప్పారు. పది రోజుల నుంచి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని, సైకో మాదిరిగా మారాడన్నారు. సంఘటన స్థలాన్ని చిట్యాల సీఐ వేణుచందర్​ పరిశీలించారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. 

రూపాయి కూడా ఇవ్వనన్నందుకు..  

గూడూరు :  మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తీగళవేణి గ్రామంలో ఓ కొడుకు తన తండ్రి పైసలియ్యడం లేదంటూ కొట్టి చంపాడు. గ్రామస్తులు, ఎస్సై రాణా ప్రతాప్ కథనం ప్రకారం...కందలం లింగాచారి(70)కి రమేశ్, బ్రహ్మచారి కొడుకులు. కొంతకాలం కిందటే తనకున్న కొద్దిపాటి ఆస్తిని ఇద్దరికీ పంచి ఇచ్చాడు. అయితే, చిన్న కొడుకు రమేశ్​మద్యానికి బానిసై తరచూ గొడవలు పెట్టుకునేవాడు. ఈ లొల్లి భరించలేక  అతడి భార్య పుట్టింటికి వెళ్లింది. లింగాచారి గ్రామంలోని  బ్రహ్మం గారి గుడిలో పూజారిగా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకువస్తున్నాడు. 

 గురువారం రాత్రి మద్యం తాగి వచ్చిన రమేశ్..​లింగాచారిని డబ్బులివ్వాలని అడిగాడు. ‘వయస్సు సహకరించకపోయినా ఏదో పని చేస్తూ డబ్బులు తీసుకువచ్చి ఇస్తున్నా. ఇంకా ఇంకా తేవాలంటే ఎక్కడికి పోవాలె..ఇక నుంచి నీ తాగుడుకు ఒక్క రూపాయి ఇచ్చేది లేదు’ అని ఖరాకండిగా చెప్పాడు. దీంతో ఆవేశానికి లోనైన రమేశ్​ తండ్రిని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. దీంతో లింగాచారి ప్రాణం పోయింది. పెద్ద కొడుకు బ్రహ్మచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, రమేశ్​ను అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ చెప్పారు.