హసన్ పర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం దేవన్నపేటలో కొడుకు మరణాన్ని తట్టుకోలేని ఓ తల్లి మనోవేదనకు గురై గుండెపోటుతో కన్నుమూసింది. గ్రామానికి చెందిన మోడెం సదానందంగౌడ్ (54) కొద్దిరోజుల కిందట అనారోగ్యానికి గురయ్యాడు. ట్రీట్ మెంట్ కోసం హైదరాబాద్ తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశాడు. దీంతో శనివారం అంత్యక్రియలు పూర్తి చేశారు.
కాగా, కొడుకు మరణంతో తల్లడిల్లిన అతడి తల్లి మోడెం నర్సమ్మ(70) తీవ్ర మనోవేదనకు గురైంది. మూడు రోజులుగా అతడినే తలుచుకుంటూ ఏడుస్తోంది. ఈక్రమంలోనే సోమవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబసభ్యులు వరంగల్ లోని ఓ హాస్పిటల్ కి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలోనే హార్ట్ ఎటాక్ తో చనిపోయింది. ఇద్దరి మరణంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.