- ఖమ్మం జిల్లా కారేపల్లిలో ఘటన
కారేపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర తండాలో పింఛన్ డబ్బులు ఇవ్వడం లేదని తల్లిని కొట్టి చంపాడో కొడుకు. సింగరేణి సీఐ తిరుపతిరెడ్డి కథనం ప్రకారం...భాగ్యనగర తండాకు చెందిన గుగులోత్ సక్రి(65) భర్త సింగరేణిలో రిటైర్డ్ అయి చనిపోగా భర్త పింఛన్ వస్తోంది. సక్రీకి ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు కొడుకులు ఉన్నా ఒంటరిగానే జీవిస్తోంది. పెద్ద కొడుకు గుగులోత్ భీముడు కార్ డ్రైవర్గా హైదరాబాద్లో పని చేస్తున్నాడు. ఈ నెల15న తండాకు వచ్చిన భీముడు తల్లి దగ్గరికి వెళ్లి పింఛన్ డబ్బుల విషయంలో గొడవపడ్డాడు.
పింఛన్ పైసలు తనకు ఇవ్వకుండా బిడ్డలకే ఇచ్చుకుంటున్నావని తల్లితో గొడవపడి కర్రతో తలపై కొట్టి చంపాడు. గొల్లెం పెట్టి ఏమీ తెలియనట్లుగా వెళ్లిపోయాడు. చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూడగా సక్రి చనిపోయి ఉంది. భీముడిపై అనుమానంతో విచారించగా నేరం అంగీకరించాడని, రిమాండ్ కు తరలించినట్లు సీఐ తిరుపతి రెడ్డి తెలిపారు.