అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం.. ఆత్మతృప్తికై మనుషులు ఆడే నాటకం.. వింత నాటకం.. ఎవరు తల్లి.. ఎవరు కొడుకు.. ఎందుకు ఆ తెగని ముడి.. కొనఊపిరిలో ఎందుకు అనగారణి అలజడి.. కరిగే కొవ్వొత్తిపై కనికరం ఎవరికి.. అవి కాలుతున్న వెలుగులే కావాలి అందరికీ.. 1972లో వచ్చిన తాత మనవడు సినిమాలోనిది ఈ పాట.. ఈ పాటకు అద్దం పడుతూ.. ఓ పెద్దావిడ తన కోరికను తీర్చుకోవాలనుకున్నది.. బతికి ఉండగానే పెద్దకర్మ భోజనాలు పెట్టాలని.. ఊరంతా పిలిచి వేడుకగా చేసుకోవాలని తపించింది. తన కోరికను కొడుకుల ముందు ఉంచి.. బతికి ఉండగానే పెద్దకర్మ భోజనాలు పెట్టించింది. ఈ వింత ఘటన.. ఆ తల్లి వింత కోరిక ఆంధ్రరాష్ట్రంలో జరిగింది.
కృష్ణా జిల్లా పెడన మండలం ముచ్చర్ల గ్రామంలో రంగమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు ఉంది. త్వరలోనే చావు ఖాయం అని డిసైడ్ అయిన ఆ రంగమ్మ.. ఇప్పటికే తన ఆస్తులు అన్నింటినీ కొడుకులకు రాసిచ్చేసింది. చేతిలో ఏమీ లేదు.. ఇలాంటి సమయంలో నేను చనిపోతే నా కొడుకులు ఏం చేస్తారు.. కనీసం నా పెద్ద కర్మ అయినా చేస్తారా.. భోజనాలు పెడతారా లేదా అనే డౌట్ వచ్చింది. నేటి సమాజంలోని సంఘటనలు చూస్తున్న రంగమ్మకు ఓ ఆలోచన వచ్చింది. కొడుకులను పిలిచి.. నా పెద్ద కర్మ భోజనాలు నేను బతికి ఉండగానే పెట్టాలని.. అందు కోసం ఊరు అందరినీ పిలవాలని సూచించింది. కొడుకులు, బంధువులు షాక్ అయ్యారు. ఆ తల్లి రంగమ్మ పట్టుబట్టి అనుకున్నది సాధించింది.
Also Read : రూ.4 లక్షలు పలికిన కచిడి చేప.. రాత్రికి రాత్రే లక్షాధికారి
ఊరు మొత్తానికి కబురు పెట్టారు రంగమ్మ కొడుకులు, బంధువులు, చుట్టాలకు సమాచారం ఇచ్చారు. తల్లి రంగమ్మ పెద్ద కర్మ భోజనాలు బతికి ఉండగానే ఏర్పాటు చేయటం జరిగింది.. ఇది మా తల్లి కోరిక అని చాటింపు వేశారు. పెద్ద కర్మ రోజు ఎలాంటి భోజనాలు పెడతారో.. అచ్చం అలాంటి భోజనాలు తయారు చేయింది.. ఆ తల్లి కళ్లెదుటే అందరికీ వడ్డించి పెట్టారు. ఈ కార్యక్రమం మొత్తం కళ్లారా చూసిన తల్లి రంగమ్మ హ్యాపీగా ఫీలయ్యింది. ఊరంతా ఇదేమి చోద్యం అంటూ నోరెళ్లబెట్టింది.. మరికొందరు ఇదేమి తిక్క అంటూ గుసగుసలాడుకున్నారు.
తల్లి శవం ఇంట్లో ఉండగానే ఖర్చులకు వాటాలు వేసుకునే ఈ రోజుల్లో.. తల్లి తుది శ్వాస విడిచిన మరుక్షణంలోనే ఆస్తుల కోసం కొట్టుకుంటున్న కొడుకులు ఉన్న ఈ రోజుల్లో.. తల్లి బతికి ఉండగానే.. ఆమె వింత కోరికను తీర్చిన కొడుకులకు హ్యాట్సాఫ్ అంటున్నారు జనం. బతికి ఉండగా ఇంత బాగా చేసిన కొడుకులు.. రేపు రంగమ్మ పోయిన తర్వాత కూడా ఇంతే బాగా చేస్తారా.. ఇలాగే ఘనంగా భోజనాలు పెడతారో లేదో చూడాలి అంటూ మరికొందరు అమ్మలక్కలు చర్చించుకోవటం విశేషం. ఏదిఏమైనా అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం అని పెద్దలు ఎప్పుడో చెప్పారు.. ఆనాటి రంగమ్మకు ఆ మాత్రం తెలియదా ఏంటీ... అందుకే ముందే పెద్ద కర్మ భోజనాలను తన కళ్లారా చూసింది..