మన భాషల్ని బతకనీయట్లె

అమ్మను మమ్మీ అంటూ ఇంగ్లీష్ భాష తియ్యని తెలుగుని డమ్మీని చేసింది. నాన్నా, అన్నా, అక్కా, చెల్లీ అనే తల్లి భాషలోని చక్కని పిలు పులను చప్పగా మార్చేసింది. పరాయి భాషలో పలకరించటం వల్ల మన వాళ్లు కానివాళ్లు అవుతున్నారు. మన సంస్కృతులు, మన సంప్రదాయాలు మరుగునపడిపోతున్నాయి. మనుషులం ఇండియాలోనే ఉంటున్నా ఇంగ్లీష్ ప్రభావంతో మనసులో ఇతర దేశాల ప్రజలమనే భావన కలుగుతోంది. ఈ పరిస్థితులు మారాలంటే మాతృ భాషను కాపాడుకోవాలి. నేటి భాషలన్నింటికీ పుట్టినిల్లయిన ఆదివాసీల భాషలకు లిపిని కనిపెట్టాలి. అవి అంతరించిపోకుండా చూడాలి. ఇవాళ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా భాషల మనుగడ ఎట్లుందో గుర్తుచేసుకుందాం..

భాషలకు ప్రత్యేకంగా ఒక రోజంటూ లేని లోటు 20 ఏళ్ల కిందట తీరిపోయింది. 2000 సంవత్సరం నుంచి ‘ఫిబ్రవరి 21’ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే దానికి బంగ్లాదేశే కారణం. 1952లో తూర్పు పాకిస్థాన్ (నేటి బంగ్లా దేశ్ ) భాషాభిమానులు తమ మాతృ భాష బెంగాలీని రక్షించుకోవటానికి పోరాటం చేశారు. ఈ ఉద్యమాన్ని అణచివేయటానికి పాకిస్థాన్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఆ సందర్భంగా జరిగిన దాడిలో 1952 ఫిబ్రవరి 21న అనేక మంది చనిపోయారు. ఎంతో మంది గాయాల పాలయ్యారు. తదనంతరం కొందరికి జైలు శిక్ష కూడా పడింది.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించాలని కెనడాలోని ‘ప్రపంచ మాతృ భాషా ప్రేమికులు’ అనే సంస్థ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన యునెస్కోను 1999లో కోరింది. దీనిపై స్పందించిన యునెస్కో.. సభ్యదేశాల నుంచి నేషనల్ కమిషన్ కు ప్రపోజల్ వస్తేనే పరిశీలిస్తామని తెలిపింది. అదే ఏడాది యునెస్కో సభ్యత్వ మండలికి ఎన్నికైన బంగ్లాదేశ్ ఈ దినోత్సవ నిర్వహణ గురించి ప్రతిపాదన చేసింది. నాటి బంగ్లా​ విద్యా శాఖ మంత్రి ఎ.ఎస్ .సాధిక్ 1999 సెప్టెంబర్ 9న ప్రపోజల్ పంపారు . ఆ ప్రతిపాదనను ఇండియా, శ్రీలంక, రష్యా , ఈజిప్ట్​, సౌదీ అరేబియా తదితర 28 దేశాలు బలపరిచాయి.

బంగ్లా​ ప్రతిపాదనను యునెస్కో భాషా విభాగం 35వ ముసాయిదా తీర్మానంగా నేషనల్ కమిషన్ పరిశీలనకు పంపింది. అనంతరం ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరపాలని యునెస్కో 30వ సాధారణ మహాసభ 1999 నవంబర్ 17న ప్రకటించింది. తర్వాతి ఏడాది నుంచి అమల్లోకి వచ్చింది. నేడు గ్లోబలైజేషన్ వల్ల కొన్ని భాషలకే అధిక ప్రాధాన్యం లభిస్తోంది. ప్రపంచ భాషల్లో 64 భాషలు వందేళ్ల తర్వాత అంతరించబోతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఏడు వేల భాషలు ఉన్నాయి . వందేళ్ల తర్వాత 25 వందల భాషలే వాడుకలో ఉంటాయని వాషింగ్టన్ డీసీలోని ‘ఎన్విరాన్ మెంటల్ సైన్స్ వరల్డ్ వాచ్ ’ హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే పది భాషలు(హిందీ –49.6 కోట్ల మంది, బెంగాలీ–21.5 కోట్ల మంది) మాత్రమే ఉనికిని నిలుపుకునే అవకాశం ఉంది. ఇండియాలో 427 భాషలుండగా వాటిలో చాలా వరకు అంతరించిపోతున్నాయి . ప్రపంచంలోని మొత్తం భాషల్లో సగం భాషలు 8 దేశాల్లోనే వాడుకలో ఉన్నాయి. ప్రాంతీయ భాషలపై నిషేధాలు, పేరెంట్స్ తమ పిల్లలకు మాతృ భాషను నేర్పకపోవటంతో భాషలు అంతరిస్తున్నాయి . ప్రజలు మాతృ భాష మాధుర్యాన్ని గుర్తు చేసుకోవాలని, ఆయా భాషల సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టుకోవాలని యునెస్కో సూచించింది. భాషల వైవిధ్యా న్ని ప్రోత్సహించటం, బోధనలో మాతృ భాష ప్రాధాన్యా న్ని గుర్తించటం మాతృ భాషా దినోత్సవ లక్ష్యాలు.