విద్యలో మాతృభాష అనివార్యం.. లేదంటే విద్యాభివృద్ధికి తీవ్ర ఆటంకం

విద్యలో మాతృభాష అనివార్యం.. లేదంటే విద్యాభివృద్ధికి తీవ్ర ఆటంకం

భారతదేశం వివిధ భాషల నిలయం. విద్యా విధానంలో ప్రాంతీయ భాష, ఒక దేశ భాష, ఇంగ్లీషు భాష ఈ మూడు భాషలు సర్వసాధారణంగా అన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంటాయి.  తమిళనాడు విద్యాసంస్థల్లో మాత్రం తమిళం, ఇంగ్లీష్ భాషలను మాత్రమే బోధిస్తారు.  భారతదేశంలో మాతృభాషలో విద్యాబోధన లేకపోవడం  వలన దేశంలో విద్యాభివృద్ధికి తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నది.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ఇటీవల మాతృభాష  తెలుగును ప్రోత్సహించడానికి చర్యలు తీసుకున్నది.

  తెలంగాణ ప్రభుత్వ డేటా ప్రకారం, 25.6 లక్షల మంది పిల్లలు తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పాఠశాలల్లో చేరారు.  వారిలో 10.16 లక్షల మంది విద్యార్థులు ఇంగ్లీష్-మీడియం పాఠశాలల్లో చేరగా, 15.44 లక్షల మంది విద్యార్థులు తెలుగు-మీడియం పాఠశాలల్లో చేరారు. ప్రభుత్వ పాఠశాలల్లో సగానికి పైగా ఇంగ్లీష్- మీడియం పాఠశాలలుగా  మారుతున్నాయి. 

ఇతర బోర్డులు నిర్వహించే పాఠశాలల్లో  తెలుగు కేవలం ఐచ్ఛిక భాష.  పాఠశాలల్లో  తెలుగు నేర్చుకోవడంపై ప్రాధాన్యత తక్కువగా ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం  తెలుగు భాషకు ప్రాధాన్యత కల్పిస్తూ 2025-26 విద్యా సంవత్సరం నుండి   తెలంగాణ రాష్ట్రంలోని   సీబీఎస్ఇ,  ఐసీయస్ఇలతో  సహా అన్ని పాఠశాలల్లో  తెలుగు భాష బోధన, పరీక్ష నిర్వహణ ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు తప్పనిసరిగా జరగాలని ఇటీవల ఆదేశాలు జారీచేసింది.   
.
దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తన హయాంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం1968 (NPE1968, Natio nal policy on education)లో  ‘త్రిభాషా సూత్రం’ ను కొఠారి కమిషన్ సిఫార్సు చేసింది.  దీని ప్రకారం హిందీ మాట్లాడే రాష్ట్రాలకు,  మొదటి భాషగా హిందీ,  రెండో  భాషగా ఇంగ్లీషు,  మూడో భాషగా  ఆధునిక భారతీయ భాష (ప్రాధాన్యంగా దక్షిణ భారతదేశం నుంచి) చేర్చటం జరిగింది. 

హిందీ మాట్లాడని రాష్ట్రాలకు,  మొదటి భాషగా  ప్రాంతీయ భాషను, రెండో భాషగా హిందీని, మూడో భాషగా ఇంగ్లీషు చేర్చటం జరిగింది.  దివంగత  ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం1986(NPE1986),  మాజీ  ప్రధాని పీవీ నరసింహారావు సవరించిన నూతన జాతీయ విధానం1992 ‘త్రిభాషా సూత్రం’ను  కొనసాగించారు.  ఐక్యరాజ్యసమితి 2015లో  నిర్దేశించిన 17 స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలో నాణ్యమైన విద్య 4 వ లక్ష్యం.  అందుకోసం 34 సంవత్సరాలు తరువాత  29  జులై 2020లో  కేంద్ర  మంత్రివర్గం  జాతీయ విద్యా విధానం2020  (National education policy‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2020) ని ఆమోదించినది. 

జాతీయ విద్యావిధానం 2020  ప్రకారం

కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన NEP 2020  ప్రకారం రాజ్యాంగ నిబంధనలు, బహుళ భాషావాదాన్ని  ప్రోత్సహించడంతోపాటు జాతీయ ఐక్యతను పెంపొందించవలసిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని  ‘త్రిభాషా సూత్రాన్ని’ కొనసాగిస్తున్నది. దీని ప్రకారం మొదటిది మాతృభాష,  రెండోది భారతీయ భాషలలో ఏదైనా ఒక భాష,  మూడోది ఇంగ్లీషు భాషను  నేర్చుకోవాలి.    పిల్లలు నేర్చుకునే భాషలను  రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యార్థులు  స్వయంగా ఎంపిక  చేసుకుంటారు. 

సంపన్న దేశాల్లోనూ మాతృభాషలో విద్యా బోధన

యునెస్కో  ప్రకారం మాతృభాషలో  విద్యాబోధన.. విద్య ప్రారంభ దశ నుంచి అవసరం అయితే విద్య చివరి దశ వరకు కొనసాగించవచ్చునని పేర్కొంది. ‘బహు భాషా’ ప్రపంచంలో ‘మాతృభాషలో  విద్యాబోధన’ విద్యార్థుల  అవగాహనను  మెరుగుపరుస్తుందని, విద్యార్థులు మెరుగ్గా పనిచేయటంలో సహాయపడుతుందని,  విషయాలను, భావనలను మరింత త్వరగా నేర్చుకుంటారు అని,  త్వరగా  గ్రహించగలరు అని,  ప్రపంచ అనుభవాలు తెలియజేస్తున్నాయి. ఉదాహరణకు మాతృభాషలో విద్యాబోధన చేస్తున్న చైనా, రష్యా, అమెరికా, జర్మనీ మొదలగు అనేక దేశాలు పరిశోధనలలో,  విద్యా విధానంలో ఎంతో అభివృద్ధి  చెందాయి.  

మాతృభాషలో చదివిన ప్రముఖులు ఎందరో..

మనదేశంలో కూడా  మాతృభాషలో చదువుకున్న అబ్దుల్ కలాం లాంటి ప్రముఖ శాస్త్రవేత్తలు, విద్యావంతులు, బ్యూరోక్రాట్లు, గొప్ప పరిపాలన దక్షత గల  రాజకీయ నాయకులు సైతం మాతృభాషలో చదువుకున్నవారే. అందుకనే జాతీయ విద్యా విధానం2020లో ఐదు లేదా ఎనిమిదో తరగతి వరకు మాతృభాషలో  తప్పనిసరిగా విద్యాబోధన చేయాలని నిబంధన చేర్చడం జరిగింది. అవసరమైతే  మాతృభాషలో విద్యాబోధన ఇతర తరగతులకు సైతం వర్తింప చేయవచ్చునని 
పేర్కొనటం జరిగింది. 

గ్రామీణ విద్యార్థులకు ఇంగ్లీష్ భయం

కొంతమంది విద్యార్థులు పుట్టుకతోనే  క్రిటికల్ థింకింగ్,  సృజనాత్మక ఆలోచన, గొప్పనైపుణ్యాలను కలిగి ఉంటారు. గ్రామీణ విద్యార్థులలో సైతం అటువంటి విద్యార్థులు ఉంటారు. ఉదాహరణకు రామానుజన్ చిన్నప్పటి నుంచి లెక్కలలో  అత్యంత  ప్రతిభాపాటవాలు కలిగి ఉన్నవాడు.  ఇంగ్లీష్ భాష అంత తెలియని  గ్రామీణ విద్యార్థులు మాతృభాషలో  విద్యాబోధన కాకుండా ఇంగ్లీష్ వంటి పరభాషలో  విద్యను బోధించటం వలన వారు  చదువు అంటేనే భయపడి  విద్యాభివృద్ధి చెందక ‘స్కూల్ డ్రాప్ అవుట్స్’ గా మిగిలిపోతున్నారు.  

ఒక సర్వే ప్రకారం 8వ తరగతిలో విద్యార్థులు ఎక్కువ  స్కూల్ డ్రాప్ అవుట్స్ అవుతున్నారని గుర్తించడం జరిగింది. దీనిని నివారించడానికి గాను NEP–2020 లో  మాతృభాషలో  విద్యాబోధన చేసుకోవడానికి,  స్థానిక పరిస్థితులకు అనుగుణంగా  సిలబస్ తయారుచేసుకునే వెసులుబాటును కూడా కల్పించింది. 

మాతృభాషా విద్యపై ఆలోచన తీరు మారాలి

తెలుగువారు ఇంగ్లీషు భాష  ద్వారానే విద్యాభివృద్ధిసాధ్యమని భావిస్తారు.  తమిళులు  వారి  మాతృభాషను  ప్రోత్సహిస్తారు.  భారతదేశంలో చాలామంది గొప్ప 
శాస్త్రవేత్తలు  తమిళనాడుకు  చెందినవారు.  ఉదాహరణకు శ్రీనివాస రామానుజన్,  సీవీ .రామన్ (భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి విజేత1930), వెంకట్రామన్ రామకృష్ణన్ (రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి2009), ఎ.పి.జె.అబ్దుల్ కలాం మొదలగువారు.  

లెక్కలు చేయడంలో కావలసింది లాజికల్ థింకింగ్ తప్ప భాష కాదు.  మాట్లాడలేని మూగవారు సైతం కఠినమైన లెక్కలను చేయగలరు. ఇక్కడ భాష అనేది అంతగా  కీలక పాత్ర వహించదు.  విమర్శనాత్మక ఆలోచన (క్రిటికల్ థింకింగ్)మాత్రమే అవసరం. రాష్ట్ర ప్రభుత్వాలు NEP–2020లో  సూచించినట్లుగా  మాతృభాషలో  విద్యాబోధన  అభివృద్ధికి కృషిచేసి, విద్యను  ప్రతి ఒక్కరు  ఆస్వాదించేవిధంగా  సులభతరం చేయాలి.

మాతృభాష  కీలక పాత్ర


విద్యాబోధనలో ఉపాధ్యాయుడు  విషయ పరిజ్ఞానాన్ని విద్యార్థికి బదిలీ చేయడంలో భాష అనేది  అత్యంత  ప్రభావవంతమైన  వాహకంగా (మాధ్యమంగా) ఉపయోగపడుతుంది.  విద్యాబోధనలో  రెండు అంశాలు ప్రధానంగా ఉంటాయి.  అందులో  మొదటిది ఉపాధ్యాయునికి విషయ పరిజ్ఞానం  కలిగి ఉండటం, రెండోది  తెలిసిన విషయాన్ని అర్థమయ్యేటట్టుగా విద్యార్థికి  బోధించటం.  ఇందులో  రెండో అంశం అర్థమయ్యేటట్టు భోధించటంలో  సరళవంతం అయిన  మాతృభాష  కీలక పాత్ర వహిస్తుంది.  

ఉపాధ్యాయునికి ఎంత విషయ పరిజ్ఞానం ఉన్నప్పటికీ అతను బోధించే భాష సులభతరంగా  లేనప్పుడు విద్యార్థి ఏం నేర్చుకోలేడు. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థికి మరొక మార్గంలేక  భట్టీకొట్టటం  జరుగుతుంది.  ఇలా గుడ్డిగా భట్టీకొట్టటం వలన మార్కులు వస్తాయి తప్ప సబ్జెక్టుపై విద్యార్థికి  ‘పట్టు ఉండదు’, పరిశోధనలు చేయడానికి లాభం ఉండదు.  విద్యార్థికి సబ్జెక్టుపై  ‘పట్టు లేనప్పుడు’  వినూత్నమైన ఆలోచన,  సృజనాత్మక ఆలోచన లోపిస్తుంది.  అందువలన సాధించిన మార్కులు,  డిగ్రీలు విద్యార్థులను కేవలం కాగితపు పులులుగా మాత్రమే తయారుచేస్తుంది.

- డా. శ్రీధరాల రాము,  
ఫ్యాకల్టీ ఆఫ్  కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్